విమర్శల నేపథ్యంలో... నేటితో కుంభమేళా ముగిస్తారా?

  • కుంభమేళాలో కనిపించని కొవిడ్ నిబంధనలు
  • నిన్నటి వరకు దాదాపు 10 లక్షల మంది పుణ్య స్నానాలు
  • భక్తులను అదుపు చేయడంలో చేతులెత్తేసిన ఉత్తరాఖండ్ సర్కారు
  • మతపెద్దలతో చర్చించిన అనంతరం నేడు ప్రకటించే అవకాశం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతున్న సమయంలో హరిద్వార్ ‌లో జరుగుతున్న కుంభమేళాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలాదిమంది ఎలాంటి నిబంధనలు పాటించకుండా పుణ్యస్నానాలు ఆచరిస్తుండడం కరోనా వ్యాప్తికి మరింత కారణం అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కుంభమేళాను నేటితో ముగించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మతపెద్దలతో చర్చించిన అనంతరం నేడు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఘాట్ల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తామని కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రభుత్వం ప్రకటించింది.

 అయితే, లక్షలాదిమంది తరలి వస్తుండడంతో నిబంధనలు గాలిలో కలిసిపోయాయి.  నాగసాధువులు, భక్తులతో హరిద్వార్‌లోని ఘాట్‌లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో భౌతిక దూరం ఊసే లేకుండా పోయింది. ఈ క్రమంలో భక్తులను అదుపు చేయడం, కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేయడం అసాధ్యంగా మారడంతో ప్రభుత్వంపై విమర్శల జడివాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో కుంభమేళాను నేటితో ముగించాలని ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు నేడు ప్రకటించే అవకాశం ఉంది.

 వాస్తవానికి కుంభమేళా మూడు నెలలపాటు జరుగుతుంది. అయితే, కొవిడ్ చెలరేగిపోతున్న దృష్ట్యా ఈసారి దానిని నెల రోజులపాటు నిర్వహించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల మొదటి వారంలోనే కుంభమేళా ప్రారంభం కాగా, 12, 14 తేదీల్లో షాహీ స్నాన్‌ను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిన్న మధ్యాహ్నం నాటికి దాదాపు 10 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.


More Telugu News