జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్‌పై 8 సంవత్సరాల నిషేధం

  • 2016- 2018 మధ్య కోచ్‌గా పనిచేసిన స్ట్రీక్
  • అంతర్గత సమాచారాన్ని బుకీలకు చేరవేసినట్టు ఆరోపణలు
  • చేసిన తప్పును అంగీకరించిన స్ట్రీక్
  • పశ్చాత్తాపం వ్యక్తం చేసిన మాజీ సారథి
ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించాడంటూ జింబాబ్వే మాజీ కెప్టెన్, కోచ్ హీత్‌ స్ట్రీక్‌ను ఐసీసీ 8 సంవత్సరాలపాటు నిషేధించింది. ఈ నిషేధం క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని తెలిపింది. 2016 నుంచి 2018 వరకు జింబాబ్వే జాతీయ జట్టుతోపాటు ఇతర దేశవాళీ లీగ్‌లలో జట్లకు స్ట్రీక్ కోచ్‌గా పనిచేశాడు.

ఆ సమయంలో అతడు అవినీతికి పాల్పడడం, అంతర్గత సమాచారాన్ని బుకీలకు చేరవేయడం, ఆటగాళ్లకు బుకీలను పరిచయం చేయడం వంటి ఆరోపణలను స్ట్రీక్ ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై విచారణ ప్రారంభించగా, దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో అతడిపై ఎనిమిదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. చేసిన తప్పునకు స్ట్రీక్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఐసీసీ నిర్ణయాన్ని అంగీకరించాడు. కాగా, స్ట్రీక్‌పై ఐసీసీ విధించిన నిషేధం 2029 మార్చి 28న తొలగిపోతుంది.


More Telugu News