ఇద్దరిని చంపి.. కేసును వారిపై తోసేందుకు సచిన్ వాజే స్కెచ్​..!

  • అంబానీ ఇంటి ముందు కారు కేసులో కొత్త ట్విస్ట్
  • ఆ కేసును వారిపై తోసేందుకు ప్లాన్
  • కారును పెట్టిన రోజే ఎన్ కౌంటర్ కు ప్రణాళికలు
  • బెడిసి కొట్టడంతో హిరెన్ కారుతో ప్లాన్ బి
  • ఆ తర్వాత హిరెన్ హత్య
ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టిన కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఓ ఇద్దరిని బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేసి.. ఆ కారు పెట్టిన నేరాన్ని వారిపైకి తోసేసేందుకు ఈ కేసులో ప్రధాన నిందితుడు, సస్పెండ్ అయిన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే దుష్ట పన్నాగం పన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు చెబుతున్నారు. సచిన్ వాజే ఇంట్లో దొరికిన ఓ పాస్ పోర్ట్ ఆధారంగా అతడు ఎన్ కౌంటర్ కు ప్లాన్ చేశాడని అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఆ పాస్ పోర్ట్ కలిగిన వ్యక్తితో పాటు మరో వ్యక్తిని ఎన్ కౌంటర్ చేసేందుకు ప్లాన్ వేశానని వాజే చెప్పినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 25న ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, తాను అనుకున్న స్కెచ్ ప్రకారం.. అదే రోజు ఆ ఇద్దరిని ఎన్ కౌంటర్ చేసేందుకు నిర్ణయించాడని చెబుతున్నారు. ఆ వెంటనే తాను ఆ కేసును పరిష్కరించేశానని చెప్పుకోవాలని పన్నాగం పన్నాడు.

ఆ ఇద్దరు ఔరంగాబాద్ లో మారుతి ఈకో కారును దొంగిలించి పేలుడు పదార్థాలను అందులో పెట్టారని కట్టుకథ అల్లేందుకు సిద్ధమయ్యాడని అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో ప్లాన్ బీకి వచ్చాడని అంటున్నారు. ఇందులో భాగంగా మన్సుఖ్ హిరెన్ అనే వ్యాపారిని ట్రాప్ చేసి, అతడి కారులోనే పేలుడు పదార్థాలను పెట్టి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడని, ఆ తర్వాత హిరెన్ ను చంపేశాడని చెబుతున్నారు.

పేలుడు పదార్థాలు పెట్టిన కారు నంబర్ ప్లేట్ ను మార్చాడని, చాసిస్ నంబర్ నూ చెరిపేశాడని అంటున్నారు. అయితే, కారుపై ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ స్టిక్కర్ ఆధారంగా ఏటీఎస్ పోలీసులు కేసును ఛేదించారని చెబుతున్నారు. వేరే వారిని ఎన్ కౌంటర్ చేసి ఆ కేసును పరిష్కరించేశామని చెప్పుకుంటే హీరోలైపోతామన్న ఉద్దేశంతోనే ఇలా చేశానని వాజే చెప్పినట్టు సమాచారం. కాగా, సచిన్ వాజే అరెస్ట్ కు ముందు వాడిన ఫోన్ కనిపించకుండా పోయిందని, అది దొరికితే కేసుకు సంబంధించిన కీలక సమాచారం దొరికే అవకాశం ఉందని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.


More Telugu News