పాక్ చ‌ర్య‌ల‌పై భార‌త్ మరింత బలంగా స్పందించే అవకాశం: అమెరికా నిఘా సంస్థ

  • అమెరికా కాంగ్రెస్‌కు ఓడీఎన్ఐ నివేదిక‌
  • భార‌త్‌-పాక్ మధ్య విభేదాలు ఆందోళన కలిగిస్తున్నాయి
  • ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం
  • భార‌త్-చైనా మ‌ధ్య కూడా తీవ్రంగానే ఉన్నాయి
పాకిస్థాన్ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే భార‌త్ వెంట‌నే దీటుగా స‌మాధానం చెబుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే పాక్‌కు ప‌లుసార్లు భార‌త్ గ‌ట్టిగా బుద్ధి చెప్పింది. భ‌విష్య‌త్తులోనూ భార‌త్ ఇదే తీరుతో ముందుకు వెళ్తుంద‌ని, పాక్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే భార‌త్ మరింత బలంగా స్పందించే అవకాశముందని అమెరికా నిఘా సంస్థ 'ఆఫీస్‌ ఆఫ్‌ ది డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌'(ఓడీఎన్‌ఐ) అంచ‌నా వేసింది.

ప్రపంచ దేశాల ప‌రిస్థితులు, వాటి వ‌ల్ల క‌లిగే ముప్పు వంటి అంశాల‌పై అంచనా వేసి వార్షిక నివేదికను అమెరికా కాంగ్రెస్‌కు ఓడీఎన్ఐ సమర్పించింది. ఇందులో భార‌త్‌, పాక్‌, చైనాల గురించి కూడా ప్ర‌స్తావించింది. భార‌త్‌-పాక్ మధ్య ఉన్న విభేదాలు ప్రపంచం మొత్తానికి ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.

భారత్- పాక్‌ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేక‌పోయిన‌ప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. కశ్మీర్‌లో కల్లోలం వ‌ల్ల లేదంటే భారత్‌లో ఉగ్రదాడులు జ‌రిగితే అణ్వాయుధ దేశాలైన భార‌త్-పాక్‌ మధ్య ఘర్షణల ముప్పు పొంచి ఉందని పేర్కొంది.

పాక్ కవ్వింపు చర్యలకు భార‌త్ ప్ర‌ధాని మోదీ నాయకత్వంలో భారత్‌ గతంలో కంటే ఎక్కువ సైనిక శక్తితో స్పందించే అవకాశముందని చెప్పింది. భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై ప‌లు విష‌యాల‌ను ఓడీఎన్‌ఐ నివేదిక‌లో పేర్కొంది. గ‌త ఏడాది మే నుంచి భారత్‌-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని గుర్తు చేసింది.

రెండు దేశాల జవాన్ల మధ్య ప్రత్యక్ష ఘర్షణలకూ ఆ వివాదాలు దారితీశాయని పేర్కొంది. ఇరు దేశాలు దౌత్య, సైనికపరమైన చర్చల తర్వాత సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు అంగీక‌రించిన‌ప్ప‌టికీ  సైనిక ఉద్రిక్తతలు ఇంకా తీవ్రంగానే ఉన్నాయని అభిప్రాయపడింది.

చైనా పొరుగుదేశాలపై బలవంతపు చర్యలకు పాల్పడేందుకు య‌త్నిస్తోంద‌ని అమెరికా నిఘా సంస్థ తెలిపింది. అంతేగాక‌, వివాదాస్పద భూభాగాలపై తాము చేస్తోన్న వాద‌న‌ల‌ను అంగీకరించాలని ప‌లు దేశాలను బలవంతపెడుతోంద‌ని నివేదిక పేర్కొంది.


More Telugu News