విదేశాల్లో స్ఫుత్నిక్-వి 10 డాలర్లు... ఇండియాలో 2 డాలర్లే ఇస్తామంటున్న కేంద్రం!

  • ఇండియాలో ప్రస్తుతం 2 వ్యాక్సిన్ల పంపిణీ
  • అత్యవసర వినియోగానికి స్ఫుత్నిక్ వీకి అనుమతి
  • ధర విషయంలో తొలగని సందిగ్ధత
రష్యన్ సంస్థ ఆర్డీఐఎఫ్ తయారు చేయగా, ఇండియాలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన స్ఫుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ ధర విషయమై ఇంకా ఎటూ తేలలేదు. భారత్ లో ఈ వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ కు విదేశాల్లో 10 డాలర్లు (సుమారు రూ. 750) వరకూ ధర ఉండగా, ఇండియాలో ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ ల ధర 2 డాలర్లు (సుమారు రూ. 150)గా ఉంది. స్ఫుత్నిక్-విని సైతం ఇదే ధరపై ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ను కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే, ఇంత తక్కువ ధరకు డాక్టర్ రెడ్డీస్ అంగీకరిస్తుందా? అన్న విషయంపై ఇంతవరకూ స్పష్టత లేదు. ఇదే సమయంలో భారత ప్రభుత్వానికి తక్కువ ధరకు పరిమిత డోస్ లను అందించేందుకు ఆర్డీఐఎఫ్ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో డాక్టర్ రెడ్డీస్ తో పాటు హెటిరో డ్రగ్స్, గ్లాండ్ ఫార్మా, స్టెలిస్ బయో, పానేషియా బయోటెక్, విర్కో బయో తదితర సంస్థలు ఇదే వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ఇప్పటికే డీల్స్ కుదుర్చుకున్నాయి. మొత్తం 85.2 కోట్ల డోస్ లను ఈ కంపెనీలు తయారు చేసి, ప్రపంచ దేశాలకు ఎక్స్ పోర్ట్ చేయనున్నాయి.

ఇదిలావుండగా, తమ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి అనుమతి లభించిందని డాక్టర్ రెడ్డీస్ మంగళవారం వెల్లడించింది. తాము మూడవ దశ క్లినికల్ పరీక్షలను కూడా నిర్వహించామని, ఇండియాలో కరోనా తీవ్రత పెరుగుతున్న వేళ, ప్రభుత్వానికి టీకా సరఫరా ద్వారా తమవంతు తోడ్పాటును అందిస్తామని వెల్లడించింది. ఇప్పటికే స్ఫుత్నిక్-వి టీకాను 60 దేశాలు ఆమోదించాయని గుర్తు చేసింది.


More Telugu News