దటీజ్ రోహిత్ శర్మ... ఓడిపోవాల్సిన మ్యాచ్ ని గెలిపించాడంటున్న క్రీడా పండితులు!

  • నిన్న ఎంఐ, కేకేఆర్ మధ్య మ్యాచ్
  • 152 పరుగులకు పరిమితమైన రోహిత్ సేన
  • ఆపై 10 పరుగుల తేడాతో విజయం
  • స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న ముంబై ఇండియన్స్
ఇప్పటివరకూ ఐపీఎల్ 13 సీజన్లు గడిచాయి. అందులో ఐదు సార్లు ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. దీనికి కారణం ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం చూపించే దూరదృష్టి, దానికి తోడు ఆటగాళ్ల ఎంపిక, కచ్చితమైన ప్రణాళికలే అనడంలో సందేహం లేదు. తొలుత సచిన్ టెండూల్కర్ నేతృత్వంలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు, ప్రస్తుతం రోహిత్ శర్మ సారధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు, అప్రతిహత విజయాలతో దూసుకెళుతోంది.

గత సంవత్సరం దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ సీజన్ లో విజయం సాధించి, ఈ సంవత్సరం సీజన్ లో తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయి, రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ విజయం కూడా అంత తేలికగా దక్కలేదు. కెప్టెన్ గా రోహిత్ శర్మ కనబరిచిన పరిణతి, వ్యూహాలే చేతుల నుంచి జారిపోయిన మ్యాచ్ ని తిరిగి తెచ్చాయనడంలో సందేహం లేదు.

ఈ మ్యాచ్ లో తొలుత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆటగాళ్లు ఎవరూ రాణించక పోవడంతో కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆపై 153 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ను, 10 పరుగుల తేడాతో రోహిత్ సేన ఓడించింది.

కేకేఆర్ జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి, ముంబై ఇండియన్స్ ప్లేయర్లను కట్టడి చేసిన వేళ, ముంబై ఇండియన్స్ ఇద్దరు స్పిన్నర్లతోనే సరిపెట్టింది. మరో స్పిన్నర్ ఉంటే బాగుండేదని క్రీడా పండితులు అభిప్రాయపడ్డారు కూడా. అయితే, పిచ్ గురించి అవగాహన ఉన్న రోహిత్ శర్మ ఆలోచన వేరుగా ఉంది. రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా బౌలింగ్ లతో ఈ విషయం అర్థమైంది.

చాహర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులు మాత్రమే ఇవ్వగా, కృనాల్ 13 పరుగులు ఇచ్చి, ఒక వికెట్ తీశాడు. ముంబై గెలుపులో వీరిద్దరిదే ప్రధాన భాగస్వామ్యం అంటే సందేహం లేదు. అంతే కాదు... కెప్టెన్ రోహిత్ శర్మ సైతం 2014 తరువాత తొలిసారిగా ఐపీఎల్ లో బాల్ చేతికి తీసుకుని ఓ ఓవర్ వేశాడు. 14వ ఓవర్ ను వేసిన రోహిత్, తొలి బంతికే షకీబుల్ హసన్ ను ఔట్ చేసినంత పని చేయడంతో పాటు, మిగతా బాల్స్ సింగిల్స్ ఇచ్చాడు.

అప్పటికి కేకేఆర్ కేవలం 3 వికెట్లు కోల్పోయి, 104 పరుగులు చేసింది. అప్పుడే రోహిత్ మనసులోని ఆలోచనలు మారిపోయాయి. అప్పటినుంచి కేకేఆర్ ఆటగాళ్లను రోహిత్ సేన ముప్పుతిప్పలు పెట్టింది. నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు పడిపోయాయి. కోల్ కతా జట్టు ఒత్తిడిలో పడిపోయింది. ఇయాన్ మోర్గాన్ 7 పరుగులు మాత్రమే చేయగా, మిగతా ఆటగాళ్లు రాణించలేకపోయారు. హార్డ్ హిట్టర్ గా పేరున్న దినేశ్ కార్తీక్ సైతం బాల్ ను బౌండరీకి తరలించడంలో విఫలమయ్యాడు. ఫలితంగా కోల్ కతా జట్టు 142 పరుగులకు మాత్రమే పరిమితం అయింది.

ఈ మ్యాచ్ అనంతరం క్రీడా పండితులు రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 12వ ఓవర్ వరకూ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని జట్టు అభిమానులు కూడా భావించలేదని, అటువంటి స్థితి నుంచి తిరిగి మ్యాచ్ ని చేతుల్లోకి తీసుకుని తొలి విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లిందని కితాబునిస్తున్నారు.


More Telugu News