పోలీసులకు ఫిర్యాదు చేస్తే... పూలు పడ్డాయి, రాళ్లు పడలేదంటున్నారు: చంద్రబాబు

  • తనపై రాళ్లు విసిరితే పోలీసులు పట్టించుకోలేదన్న చంద్రబాబు
  • రాళ్లు విసిరిన వారిని దర్జాగా పంపించారని ఆరోపణ
  • గూడూరులో చంద్రబాబు రోడ్ షో
  • జగన్ వైరస్ ను ఓటుతోనే ఎదుర్కొనగలమని వ్యాఖ్యలు
  • ఓటు వేయకపోతే ప్రజలకే నష్టమన్న టీడీపీ అధినేత   
తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున పార్టీ అధినేత చంద్రబాబు నేడు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. గుడూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ కన్నా జగన్ వైరస్ ప్రమాదకరం అని, దానికి మందు లేదని అన్నారు.

జగన్ వైరస్ ను తరిమికొట్టడం ఓటుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఓటు వేయకుంటే ప్రజలకే నష్టమని పేర్కొన్నారు. తిరుపతిలో తన సభపై రాళ్లు వేశారని, మాజీ సీఎం సభపైనే రాళ్లు వేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఏఎస్పీకి ఫిర్యాదు చేస్తే... పూలు పడ్డాయి, రాళ్లు పడలేదంటున్నారని అన్నారు. రాళ్లు విసిరిన వారిని దర్జాగా పంపించారని ఆరోపించారు.

తిరుపతి రావడానికి కరోనా సాకు చెప్పిన జగన్...  వలంటీర్లకు అవార్డుల కార్యక్రమానికి ఎలా హాజరయ్యాడని నిలదీశారు. 40 ఏళ్లు ఒక్క రూపాయి ఆశించకుండా నిప్పులా బతికానని, తనపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఆ కేసులు ఎందుకు పెడుతున్నారో కూడా చెప్పరని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా అనుభవం అంత లేదు జగన్ వయసు' అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.


More Telugu News