ఇది లాక్ డౌన్ కాదు కానీ.. రేపటి నుంచి 144 సెక్షన్ తో పాటు పలు ఆంక్షలు అమలు చేస్తున్నాం: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే

  • మహారాష్ట్రలో కరోనా కల్లోలం
  • రేపటి నుంచి 15 రోజుల పాటు ఆంక్షలు
  • బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడడంపై నిషేధం
  • మరోసారి యుద్ధం ప్రారంభమైందన్న సీఎం థాకరే
  • ఇవాళ 60 వేలకు పైగా కేసులు వచ్చాయని వెల్లడి
కరోనా మహమ్మారి ధాటికి అతలాకుతలం అవుతున్న మహారాష్ట్రలో రేపటి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 15 రోజుల పాటు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నామని చెప్పారు. ప్రజలు భారీగా గుమికూడరాదని స్పష్టం చేశారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడడం నిషిద్ధమని వివరించారు. కరోనా వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయడానికి ఇంతకంటే మరో మార్గంలేదన్నారు. మరోసారి యుద్ధం ప్రారంభమైందని భావిస్తున్నామని, అయితే దీన్ని లాక్ డౌన్ అని పిలవలేమని అన్నారు.

ప్రజలు అనవసర ప్రయాణాలు చేయరాదని హితవు పలికారు. ప్రజా రవాణా వ్యవస్థను, రైళ్లను, బస్సులను నిలిపివేయడంలేదని, వాటిని అత్యవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. మెడికల్, బ్యాంకులు, మీడియా, ఈ కామర్స్, ఇంధన సేవలపై ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు.

ఇవాళ రాష్ట్రంలో 60,212 కరోనా కేసులు వచ్చాయని వెల్లడించారు. వైద్య, ఆరోగ్య వసతులను నిరంతరం మెరుగుపరుస్తూనే ఉన్నామని, అయితే కరోనా కేసులు అధికంగా ఉండడంతో ఒత్తిడి పెరిగిపోతోందని తెలిపారు. ఆక్సిజన్, పడకల కొరత ఏర్పడిందని, రెమ్ డెసివిర్ ఔషధం కోసం అధిక డిమాండ్ ఏర్పడిందని థాకరే వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ రోడ్డు మార్గాన కాకుండా వాయుమార్గాన అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరానని, ఈ విషయంలో ఆర్మీ సేవలను అడిగానని పేర్కొన్నారు.


More Telugu News