రెండు అదనపు ఐడీ కార్డులుంటేనే 'తిరుపతి' ఎన్నికలో ఓటేసేందుకు అనుమతించండి: సీఈసీకి టీడీపీ ఎంపీల వినతి

  • చంద్రబాబు సభలో రాళ్ల దాడి కలకలం
  • ఢిల్లీలో సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ ఎంపీలు
  • తిరుపతి బరిలో అక్రమాలకు అవకాశం ఉందని వెల్లడి
  • వలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని వినతి
తిరుపతిలో చంద్రబాబు ప్రచార సభపై రాళ్ల దాడి ఘటనను టీడీపీ ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ ఈ సాయంత్రం ఢిల్లీలో సీఈసీని కలిశారు. చంద్రబాబు రోడ్ షోపై రాళ్లదాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో అక్రమాలు జరిగే అవకాశాలున్నాయని, కేంద్ర బలగాలతో పోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో 2 లక్షల వరకు నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో రెండు అదనపు ఐడీ కార్డులు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతించాలని సూచించారు. తిరుపతి ఎన్నికల్లో వలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని, పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News