ఉగాది స్పెష‌ల్.. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్ విడుద‌ల‌

  • రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్'
  • చెర్రీ, తారక్‌ను ఎత్తుకుని ఎగ‌రేస్తోన్న‌ జ‌నాలు
  • చిరునవ్వులు చిందిస్తున్న ఇద్ద‌రు హీరోలు
'బాహుబలి' సినిమాల త‌ర్వాత‌ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా యూనిట్ ఉగాది సందర్భంగా మ‌రో కొత్త  పోస్టర్ ను విడుద‌ల‌ చేసింది. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. వారిద్ద‌రిని జ‌నాలు ఎత్తుకుని పైకి ఎగ‌రేస్తూ సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌ట్లు ఈ పోస్ట‌ర్ లో చూపించారు.

జ‌నాలు త‌మ‌ను పైకి ఎగ‌రేస్తుండ‌గా ఇద్ద‌రు హీరోలు చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఈ పోస్ట‌ర్‌తో ఆర్ఆర్ఆర్ టీమ్ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి.

'బాహుబ‌లి' వంటి భారీ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి ఈ సినిమా తీస్తుండ‌డంతో దీనిపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ను ఒక్కొక్క‌టిగా వదులుతూ రాజ‌మౌళి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.


More Telugu News