కోతులతో భయపెట్టి.. దొంగతనాలు చేస్తున్న వ్యక్తుల అరెస్ట్!

  • న్యూఢిల్లీలో వరుస దొంగతనాలు
  • న్యాయవాది ఫిర్యాదుతో విచారణ
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
దేశ రాజధాని వీధుల్లో తమ పెంపుడు కోతులతో తిరుగుతూ, దొంగతనాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ వ్యక్తి నుంచి అందిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ముగ్గురు వ్యక్తులు కోతులతో తనను చుట్టుముట్టారని, ఆపై తన వద్ద ఉన్న రూ. 6 వేలు కాజేశారని న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న అతను పోలీసులను ఆశ్రయించాడు.

తాను ఆటోలో కూర్చుని ఉండగా, వారు కూడా ఆ ఆటో ఎక్కారని, ఆపై ఆటో ముందు సీట్లో ఒక కోతిని కూర్చోబెట్టారని, వెనుక తన పక్కన మరో కోతిని ఉంచారని, ఆపై, తన జేబులోని పర్సు తీసి, అందులోని డబ్బును లాక్కున్నారని, తరువాత వారంతా కోతులతో సహా పారిపోయారని అతను ఫిర్యాదు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

గతంలోనూ ఇదే తరహా ఫిర్యాదులు అందడంతో, పోలీసులు సీరియస్ గా తీసుకుని, దొంగల కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి, ఓ బస్ స్టాప్ లో కోతులతో ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వన్యప్రాణ సంరక్షణ చట్టం 1972 ప్రకారం, జంతువులను బంధించడం నేరమని, ఆ సెక్షన్ కింద కూడా వారిపై కేసులు రిజిస్టర్ చేశామని, జంతువులను రెస్క్యూ సెంటర్ కు తరలించామని తెలిపారు. ఈ కేసులో నిందితుడైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు.


More Telugu News