తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

  • ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
  • వ్యవసాయానికి నాందీ దినం అని వెల్లడి
  • ఉగాది పచ్చడి గొప్ప సందేశాన్నిస్తుందని వివరణ
  • రైతు జీవితంలో వెలుగు నింపడమే తమ లక్ష్యమని ఉద్ఘాటన
తెలుగు సంవత్సరాది ఉగాది (ఏప్రిల్ 13) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్లవ నామ సంవత్సరంలో తెలంగాణ వ్యవసాయ రంగానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని, ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమని అన్నారు.

రైతుల పండగగా, వ్యవసాయానికి ప్రారంభంగా ఉగాది ప్రసిద్ధికెక్కిందని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లను ఉగాది సందర్భంగానే ప్రారంభిస్తారని, రైతులను వ్యవసాయానికి సంసిద్ధం చేసే ఉగాది రైతు జీవితంలో భాగమైపోయిందని వివరించారు.

తీపి, వగరు, చేదు రుచులతో కూడిన ఉగాది పచ్చడి సేవించి పండుగ జరుపుకోవడం గొప్ప సందేశాన్నిస్తుందని... మనిషి జీవితంలో కష్టసుఖాలు, మంచిచెడులకు అది ప్రతీకగా భావించవచ్చని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి పాలనలో చేదు అనుభవాలను చవిచూసిన తెలంగాణ రైతాంగం ఇప్పుడు స్వయంపాలనలో మధుర ఫలాలను అనుభవిస్తోందని తెలిపారు. రైతు కుటుంబాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.


More Telugu News