పవన్ కల్యాణ్ పై కక్ష సాధించాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి బాలినేని

  • వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు రద్దు చేసిన ఏపీ సర్కారు
  • సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు
  • తమకు ఎవరి సినిమా అయినా ఒకటేనన్న బాలినేని
  • రాజకీయాలు వేరు, సినిమాలు వేరని వ్యాఖ్యలు
ఇటీవల పవన్ కల్యాణ్ చిత్రం వకీల్ సాబ్ బెనిఫిట్ షోలను ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంపై విమర్శలు వస్తుండడం తెలిసిందే. దీనిపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ పై కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమకు ఎవరి సినిమా అయినా ఒకటేనని స్పష్టం చేశారు. రాజకీయం రాజకీయమే, సినిమా సినిమానే అని వివరించారు.

గతంలోనూ తాము ఎవరినీ ఇబ్బందులకు గురిచేయలేదని బాలినేని అన్నారు. సినిమాలను రాజకీయాలతో ముడివేసి చూడబోమని తెలిపారు. ఇవాళ ఏపీలో సినిమా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో తదుపరి రిలీజ్ అయ్యే సినిమాకు కూడా అవే రేట్లు ఉంటాయని, పవన్ చిత్రాలనే తాము లక్ష్యంగా చేసుకున్నామనడం సరికాదని అన్నారు.

ఇక, ఏపీలో విద్యుత్ చార్జీలను పెంచలేదని, పాత చార్జీలే వసూలు చేస్తామని బాలినేని వెల్లడించారు. వినియోగదారులపై ఎలాంటి భారం పడబోదని, ఇదంతా విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం అని ఆరోపించారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల బిగింపుపై స్పందిస్తూ, శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, త్వరలో ఇతర జిల్లాలకు విస్తరింప చేస్తామని వివరించారు.

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో వైసీపీ 4 లక్షల మెజారిటీతో గెలవడం ఖాయమని ఉద్ఘాటించారు. పోలింగ్ శాతం అధికంగా నమోదైతే అంతకంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.


More Telugu News