లాక్ డౌన్ కు బదులుగా ఫ‌డ్న‌వీస్‌ వద్ద ఏదైనా ఆలోచన ఉంటే చెప్పచ్చు: శివ‌సేన‌

  • మహారాష్ట్రకు  తగినన్ని వ్యాక్సిన్లు సరఫరా చేయాలి
  • లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి
  • లాక్‌డౌన్‌కు మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు
  •  ఫడ్నవీస్ వ్యాఖ్యల్లో కొంత నిజం వుంది 
మహారాష్ట్రకు కేంద్ర ప్ర‌భుత్వం తగినన్ని వ్యాక్సిన్లు సరఫరా చేయాలని శివ‌సేన మ‌రోసారి డిమాండ్ చేసింది. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య ఎవ‌రూ ఊహించ‌నంతగా పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై శివ‌సేన‌ అధికార పత్రిక ‘సామ్నా’లో ఓ ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. టీకా ఉత్సవ్‌లో భాగంగా త‌మ రాష్ట్రానికి కూడా వ్యాక్సిన్లు అందించి సాయ‌ప‌డ‌డం కేంద్ర ప్ర‌భుత్వ‌ విధి అని పేర్కొంది.

మ‌హారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకులు ఇక్కడి పరిస్థితులను ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పింది. అలాగే, మ‌హారాష్ట్ర‌లోని పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి వారిని కేంద్ర స‌ర్కారు ఆదుకోవాల‌ని కోరింది. క‌రోనా విజృంభిస్తోన్న‌ ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ తో పాటు కఠిన ఆంక్షలు విధించడం అనివార్యమని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ థాక‌రే ఇప్పటికే చెప్పారని శివ‌సేన పేర్కొంది.

అయితే, లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయ‌ని తెలిపింది. లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు నెల‌కొంటాయ‌ని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్న‌వీస్ కూడా అంటున్నార‌ని, ఆయన చేస్తోన్న వ్యాఖ్య‌ల్లోనూ కొంత‌ నిజం ఉంద‌ని చెప్పింది. అయితే, లాక్‌డౌన్‌కు మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని, ఒకవేళ ఫ‌డ్న‌వీస్‌ వద్ద ఏదైనా ఆలోచన ఉంటే త‌మకు దాన్ని చెప్ప‌వ‌చ్చ‌ని పేర్కొంది.  


More Telugu News