గంటకు రూ. 54 లక్షలు సంపాదిస్తున్న 'బెట్ 365' యజమానురాలు!

  • గత సంవత్సరం డెనిస్ కోయెత్స్ కు 469 మిలియన్ పౌండ్ల సంపాదన
  • యూకేలో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-5 మహిళల్లో డెనిస్
  • బోరిస్ జాన్సన్ వేతనంతో పోలిస్తే 2,360 రెట్లు అధికం
ఆమెది మామూలు ఆదాయం కాదు.. ఒక్కసారి ఆమె ఆదాయం వివరాలు వింటే పెద్దగా షాక్ తింటాం. గంటకు రూ. 54 లక్షలు సంపాదిస్తుంది. అంటే రోజుకు దాదాపు రూ. 13 కోట్లు... ఇంకా చెప్పాలంటే, సంవత్సరానికి దాదాపు రూ. 4 వేల కోట్లు. ఆన్ లైన్ జూదానికి చిరునామా అయిన 'బెట్ 365' కంపెనీ యజమానురాలు డెనిస్ కోయెత్స్ సంపాదన ఇది.

 ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయ, వ్యయాలను లెక్కిస్తే, ఆమెకు అందిన మొత్తం 469 మిలియన్ పౌండ్లు. ఈ మొత్తంలో వేతనం కింద 421 మిలియన్ పౌండ్లు కాగా, కంపెనీలో 50 శాతం వాటా ఉన్న ఆమెకు డివిడెండ్ల రూపంలో 48 మిలియన్ పౌండ్లు వచ్చాయి.

ఈ మొత్తం విలువ రూపాయల్లో చూస్తే, 4,742 కోట్లకు పైగానే. యూకేలో అత్యధిక వార్షిక వేతనంగానూ ఈ మొత్తం నిలిచింది. బ్రిటన్ కు ప్రధానిగా పనిచేస్తున్న బోరిస్ జాన్సన్ తీసుకునే జీతంతో పోలిస్తే, డెనిస్ కోయెత్స్ జీతం 2,360 రెట్లు అధికం కావడం గమనార్హం. ఇక యూకేలో పనిచేస్తున్న టాప్ 100 కంపెనీల సీఈఓలు అందుకుంటున్న వార్షిక వేతనంతో పోలిస్తే ఈ మొత్తమే ఎక్కువ. ఇప్పుడామె బ్రిటన్ లోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఐదో స్థానంలో ఉన్నారు.


More Telugu News