యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు లోయలో పడి 12 మంది మృత్యువాత

  • 35 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన వాహనం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన యోగి
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 45 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఎటావా జిల్లాలోని ఉడి-చక్కర్‌నగర్ రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది. భక్తులతో ఆగ్రా నుంచి ఎటావా జిల్లాలోని కాళికాదేవి ఆలయానికి వస్తున్న ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న 35 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని ఎటావా ఎస్పీ బ్రిజేష్ కుమార్ తెలిపారు.

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ప్రమాద వార్త తెలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.


More Telugu News