బెంగాల్ పోల్స్: బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ కారుపై దాడి

  • హుగ్లీలో ఓ పోలింగ్ బూత్ వద్ద లాకెట్ ఛటర్జీపై దాడి
  • ఎన్నికల అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు
  • యథేచ్ఛగా రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపణ
పశ్చిమ బెంగాల్‌లో నాలుగో దశ ఎన్నికలు ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నాయి. పలుచోట్ల టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. కూచ్‌బెహర్‌లోని శీతల్‌కుచిలో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, పోలింగ్ కేంద్రం వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక ఓటరు ప్రాణాలు కోల్పోయాడు.

ఇదిలా ఉండగా, హుగ్లీ జిల్లాలోని 66వ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ కారుపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. మీడియా వాహనాలపైనా దాడులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది.

ఆగ్రహంతో రగిలిపోతున్న మహిళలు, పురుషులు కారుపై దాడికి యత్నిస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కారుపై దూసుకెళ్తున్న వారిలో ఏ ఒక్కరు మాస్క్ ధరించలేదు. భౌతిక దూరం ఊసేలేదు. ఈ ఘటనపై లాకెట్ ఛటర్జీ మాట్లాడుతూ బూత్ నంబరు 66 వద్ద తన కారుపై దాడి జరిగిందని అన్నారు. వారు తన  జాకెట్ పట్టుకుని లాగారని, కారుపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. పగిలిన అద్దాలు తగిలి తనకు గాయాలయ్యాయని ఫోన్ ద్వారా ఎన్నికల అధికారులకు తెలిపారు.

కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడ చిక్కుకుపోయారని, అర్జెంటుగా సీఆర్‌పీఎఫ్ బలగాలను పంపాలని కోరారు. ఇక్కడ యథేచ్ఛగా రిగ్గింగ్ జరుగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారని, ఎన్నికల అధికారులు వచ్చేంత వరకు తానిక్కడి నుంచి కదలబోనని లాకెట్ ఛటర్జీ తేల్చి చెప్పారు.


More Telugu News