ఈఎస్‌ఐ కుంభకోణం కేసు.. హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

  • నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో సోదాలు
  • నాయిని మాజీ పీఎస్‌ ముకుందారెడ్డి, మాజీ అధికారిణి దేవికారాణి ఇంట్లోనూ..
  • రూ.6.5 కోట్లు కాజేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు
హైదరాబాద్‌లో ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు ఉద‌యం నుంచి సోదాలు చేపట్టారు. దాదాపు పది ప్రాంతాల్లో సోదాలు కొన‌సాగుతున్నాయి. మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డితో పాటు నాయిని మాజీ పీఎస్‌ ముకుందారెడ్డి, మాజీ అధికారిణి దేవికారాణి వంటి ప‌లువురి ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఈఎస్‌ఐలో వైద్య కిట్లు, ఔష‌ధాల‌ కొనుగోళ్ల  కుంభకోణంపై అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసి ఇప్ప‌టికే పలువురిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. వారిలో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి కూడా ఉన్నారు. నిందితులు గ‌తంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కాజేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే అవినీతి అధికారిణి దేవికారాణి నుంచి  ఏసీబీ అధికారులు రూ.4.47 కోట్ల న‌గ‌దును గ‌త ఏడాది సెప్టెంబరులో స్వాధీనం చేసుకున్నారు.  


More Telugu News