మమతా బెనర్జీ భద్రతాధికారిని తొలగించిన ఎన్నికల సంఘం

  • మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్‌
  • ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం
  • దీదీ కాలికి గాయమైన ఘటన నేపథ్యంలోనే తొలగింపు 
  • ఇప్పటికే ఈసీ నుంచి రెండు నోటీసులు అందుకున్న మమత
మరికొన్ని గంటల్లో నాలుగో విడత ఎన్నికలు ప్రారంభమవుతున్న తరుణంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భద్రతాధికారి అశోక్ చక్రవర్తిని ఎన్నికల సంఘం(ఈసీ) తొలగించింది. ఆయన ఎక్స్‌ కేడర్‌ విభాగంలో ఎస్పీ హోదాలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు.

గత నెల నందిగ్రామ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేస్తున్న సమయంలో మమతా బెనర్జీ కాలికి గాయమైన విషయం తెలిసిందే. అయితే, అది గుర్తు తెలియని దుండగులు చేశారని ఆమె ఆరోపించగా.. ఎన్నికల కమిషన్‌ మాత్రం అందుకు ఆధారాలేమీ లేవని కొట్టిపారేసింది. అయితే క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. భద్రతా లోపం వల్లే ఆమెకు గాయమైనట్లు ఈసీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన రోజు ఆమెకు డైరెక్టర్ ఆఫ్‌ సెక్యూరిటీగా ఉన్న వివేక్‌ సహాయ్‌ని తొలగించాలని ఆదేశించింది. తాజాగా ఓఎస్డీగా ఉన్న అశోక్‌ చక్రవర్తిని కూడా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఎన్నికల సంఘం నుంచి మమతా బెనర్జీకి ఇప్పటి వరకు రెండు నోటీసులు అందాయి. ఒకటి మతప్రాతిపదికన మైనారిటీ ఓటర్లను ప్రభావితం చేసినందుకు కాగా.. మరొకటి కేంద్ర బలగాలపై ఆరోపణలు చేసినందుకు ఆమె నోటీసులు అందుకున్నారు.


More Telugu News