రాహుల్‌ గాంధీ ఇంకా వ్యాక్సిన్‌ ఎందుకు వేయించుకోలేదు?: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫైర్

  • టీకా ఎగుమతుల్ని తప్పుబట్టిన రాహుల్‌
  • ప్రధాని మోదీకి లేఖ రాసిన కాంగ్రెస్ అగ్రనేత 
  • అనాలోచితమా? లేక ప్రాచుర్యం కోసం పాకులాటా? అని ప్రశ్న
  • రాహుల్‌పై విరుచుకుపడ్డ రవిశంకర్‌ ప్రసాద్‌
  • ఆయనకు దృష్టి లోపమని ఎద్దేవా
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ విదేశాలకు టీకాలను ఎగుమతి చేయడాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందిస్తూ.. ‘రాహుల్‌ గాంధీ ఇంకా టీకా ఎందుకు తీసుకోలేదు?’ అని ప్రశ్నించారు.

రాహుల్ ను ‘అజ్ఞాని’, ‘అహంకారి’ అని సంబోధిస్తూ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. బీజేపీని ప్రశ్నించే కంటే ముందు సొంత పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాల అవినీతిని గుర్తించాలని హితవు పలికారు. పరోక్షంగా మహారాష్ట్రలో అవినీతి ఆరోపణలను ప్రస్తావించారు.

దేశంలో కరోనా రెండో వేవ్‌ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా టీకా కొరత ఏర్పడబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో టీకాల కొరత ఉన్న సమయంలో ఇతర దేశాలకు ఎగుమతులు ఎందుకని ప్రశ్నించారు.

‘‘ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాల వలే ఇది కూడా అనాలోచిత నిర్ణయమా? లేక ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి  ప్రాచుర్యం కోసం పాకులాడుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి వ్యాక్సినేషన్‌పై కొన్ని సూచనలు కూడా చేశారు.

ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.. రాహుల్‌ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని.. రాహులే ‘దృష్టి లోపం’తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కాంగ్రెస్‌ నేత టీకా ఇంకా ఎందుకు వేయించుకోలేదని ప్రశ్నించారు. ఇది అలక్ష్యమా? లేక ఎప్పటిలాగే ఎవరికీ తెలియకుండా విదేశాలకు వెళ్లి టీకా వేయించుకున్నారా? అని చురకలంటించారు.

వ్యాక్సిన్ల కొరత ఉందన్న మహారాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదును రాహుల్‌ లేఖలో ప్రస్తావించగా.. దీన్ని కూడా రవిశంకర్‌ తనదైన శైలిలో తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత లేదని.. వైద్యారోగ్య వ్యవస్థను మెరుగుపరచాలన్న చిత్తశుద్థి కొరత  ఉందని దుయ్యబట్టారు.


More Telugu News