తెలుగులో కూడా వస్తున్న అలియా భట్ 'గంగూభాయ్ కతియావాడి'!.. టీజర్ విడుదల

  • ముంబై కామాటిపురాను ఏలిన గంగూభాయ్
  • మాఫియా డాన్లను దాసోహం చేసుకున్న వేశ్య  
  • 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారం
  • సంజయ్ లీలా భన్సాలీ మార్కు భారీతనం
ఇన్నాళ్లూ మామూలు కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన బాలీవుడ్ నటి అలియా భట్ ఇప్పుడు ఓ నిజజీవిత కథను చేస్తోంది. అదే 'గంగూభాయ్ కతియావాడి'! ముంబైలోని రెడ్ లైట్ ఏరియా అయిన కామాటిపురాలో కొన్ని దశాబ్దాల క్రితం ఓ వెలుగువెలిగిన 'గంగూభాయ్ కతేవాలి' నిజజీవిత కథ ఇది. కామాటిపురాలో వేశ్యాగృహం యజమాని అయిన గంగూభాయ్ అప్పట్లో ఆ ప్రాంతంలో చక్రం తిప్పింది.

గుజరాత్ లోని కతియావాడ్ లో 1940 ప్రాంతంలో జన్మించిన గంగూభాయ్.. తన తండ్రి వద్ద పనిచేసే రామ్నిక్ లాల్ ని ప్రేమించి, ఇంట్లో చెప్పకుండా అతనితో కలసి ముంబైకి వచ్చేసింది. అయితే, రామ్నిక్ మాత్రం ఆమెను ఓ వేశ్యాగృహంలో అమ్మేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఆమె వేశ్యగా బతికి.. తన శక్తియుక్తులతో ముంబై మాఫియా డాన్లతో సన్నిహిత సంబంధాలు నెరపి, అనూహ్యంగా ఎదిగిపోయింది. 1960లలో కామాటిపురాను ఏలేసింది. మాఫియా డాన్లను, రాజకీయ నేతలను, పోలీస్ ఆఫీసర్లను తన చుట్టూ తిప్పుకుంది. ఇంతాచేసి.. ఆమె ఐదడుగుల ఎత్తున్న మహిళ మాత్రమే అంటే నమ్మలేం! ఈమె కథను 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' అనే పుస్తకంలో జర్నలిస్టు హుస్సేన్ జైదీ వివరంగా రాశాడు.

ఇప్పుడు ఈ కథనే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు. గంగూభాయ్ గా అలియా భట్ ఇందులో చక్కని అభినయాన్ని ప్రదర్శించిందని అంటున్నారు. ఇటీవల ఈ హిందీ చిత్రం టీజర్ రిలీజ్ కాగా, తాజాగా తెలుగు డబ్బింగ్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో దర్శకుడు సంజయ్ మార్క్ భారీతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా జులై 30న రిలీజ్ చేయనున్నారు.


More Telugu News