ఆనంద్‌ మహీంద్రాను చిర్రెత్తించిన ఓ వైరల్‌ ఫొటో!

  • సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త
  • కరోనా నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం
  • వైరల్‌ అయిన ఫొటోపై అసహనం
  • భౌతిక దూరానికి అలవాటు పడాలని సూచన
  • మాస్కులు ధరించాలని హితవు
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా వుంటారన్న విషయం తెలిసిందే. సమకాలీన అంశాలు, సామాజిక స్పృహ కలిగించే విషయాలపై చురుగ్గా స్పందిస్తుంటారు. తాజాగా నెట్టింట్లో వైరల్‌ అయిన ఓ చిత్రం ఆయనను తీవ్ర అసహనానికి గురిచేసింది.

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. అందుకనుగుణంగా కొన్ని కార్యాలయాల్లో వినియోగదారులు, సిబ్బందికి మధ్య గాజు తెరలు ఏర్పాటు చేశారు. అయితే, కస్టమర్ల మాటలు వినిపించడానికి లేదా ఏదైనా అందిస్తే తీసుకోవడానికి గాజు తెరల్లో చిన్న రంధ్రాలు ఉంచే విషయాన్ని మనమంతా ఎక్కడో ఒక చోట గమనించే ఉంటాం.

అయితే, నెట్టింట్లో వైరల్‌ అయిన ఫొటోలోని వ్యక్తికి ఇవేమీ అర్థం కాలేనట్టుంది. తలను ఆ రంధ్రంలోంచి లోపలికి దూర్చి మరీ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అదీ మాస్క్‌ లేకుండా. ఇది నెట్టింట్లో వైరల్‌ కాగా.. దీన్ని చూసిన ఆనంద్‌ మహీంద్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఇంకా మనం భౌతిక దూరానికి అలవాటు పడలేకపోతున్నాం. ఇకనైనా మన వంతు కృషి చేయాలి. తలలు వెనక్కి తీసి మాస్కులు ధరిద్దాం’ అంటూ వైరల్‌ అయిన ఫొటోని పోస్ట్‌ చేసి క్యాప్షన్‌ పెట్టారు.


More Telugu News