మావోయిస్టుల చెర నుంచి సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ విడుదల... వీడియో ఇదిగో!

  • ఈ నెల 3న భీకర ఎన్‌కౌంటర్‌
  • బందీగా చిక్కిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ రాకేశ్వర్‌ సింగ్‌
  • సాయంత్రం 5 గంటలకు విముక్తి
  • టెర్రం క్యాంపునకు చేరిన జవాన్‌
  • సంతోషం వ్యక్తం చేసిన భార్య మీనూ
ఈ నెల 3న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భీకర కాల్పుల అనంతరం బందీగా చేసుకున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్ రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదల చేశారు. గత ఐదు రోజులుగా వారి చెరలో ఉన్న ఆయన్ని గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో టెర్రం అడవుల్లో వదిలిపెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన టెర్రం క్యాంపునకు చేరుకున్నట్లు ఓ సీఆర్‌పీఎఫ్‌ అధికారి తెలిపారు. ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. రాకేశ్వర్‌ను మావోయిస్టులు స్థానిక గిరిజనులు, మీడియా సమక్షంలో విడుదల చేసినట్లు తెలుస్తోంది.

గత శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో 22 మంది సైనికులు అమరులయ్యారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ రాకేశ్వర్‌ సింగ్‌ను నక్సల్స్‌ బందీగా చేసుకున్నారు.

 చర్చలకు మధ్యవర్తులను ప్రకటించాలని.. అడవుల్లో ఏర్పాటు చేసిన భద్రతా బలగాల క్యాంపులను వెంటనే తొలగించాలని మావోయిస్టులు డిమాండ్‌ చేశారు. అప్పుడే రాకేశ్వర్‌ ను విడిచిపెడతామని షరతు విధించారు. జవాన్‌ తమ వద్ద క్షేమంగానే ఉన్నట్లు బుధవారం ఓ ఫొటోను కూడా విడుదల చేశారు.

రాకేశ్వర్‌ను ఎలాగైనా సురక్షితంగా విడిపించుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన కూతురు సైతం నాన్నను విడిచిపెట్టాలని మీడియా ద్వారా నక్సల్స్‌ను కోరింది. ఈ పరిణామాల అనంతరం నేడు ఎట్టకేలకు రాకేశ్వర్‌ తిరిగొచ్చారు. ఆయన విడుదలపై భార్య మీనూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News