ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్... హైకోర్టు ఆదేశాలను బట్టి కౌంటింగ్

  • ఏపీలో నేడు పరిషత్ ఎన్నికలు
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
  • 5 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం
  • మధ్యాహ్నం 3 గంటల సమయానికి 47.42 శాతం పోలింగ్ 
ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. ఏపీలోని 13 జిల్లాల్లో 660 జడ్పీటీసీ స్థానాలు, 10,047 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.... 126 జడ్పీటీసీలు, 2371 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు, 7220 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికలు జరిపారు. పలు చోట్ల వివిధ కారణాలతో పోలింగ్ జరపలేదు.

సాయంత్రం 3 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 47.42 శాతం పోలింగ్ నమోదైంది. అదే సమయంలో జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి...

విజయనగరం జిల్లాలో 56.57 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 55.4, విశాఖ జిల్లాలో 55.29, తూర్పు గోదావరిలో 51.64 శాతం, చిత్తూరు జిల్లాలో 50.39 శాతం, కృష్ణా జిల్లాలో 49 శాతం, కర్నూలు జిల్లాలో 48.40, శ్రీకాకుళం జిల్లాలో 46.46, అనంతపురం జిల్లాల్లో 45.70, కడప జిల్లాలో 43.77, నెల్లూరు జిల్లాలో 41.8, గుంటూరు జిల్లాలో 37.65, ప్రకాశం జిల్లాలో 34.19 శాతం పోలింగ్ నమోదైంది.

కాగా, పరిషత్ ఎన్నికల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో, ఓట్ల లెక్కింపు ఎప్పుడన్నది ఇంకా తెలియరాలేదు. ఏపీలో పరిషత్ ఎన్నికలకు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు డివిజన్ బెంచ్... కౌంటింగ్ చేపట్టవద్దని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి తీర్పు రావాల్సి ఉంది.


More Telugu News