విష్ణువు అనుగ్రహంతోనే రాజయోగం ఉంటుంది... రాజునే విష్ణువుతో పోల్చితే ఎలా?: స్వామి పరిపూర్ణానంద

  • జగన్ ను విష్ణువుతో పోల్చిన రమణ దీక్షితులు
  • అది జగన్ కే చేటు చేస్తుందన్న పరిపూర్ణానంద
  • దేవుడికి చేసినట్టు వైసీపీ నేతలు జగన్ కు పూజలు చేస్తారా? అన్న స్వామి
  • రమణ దీక్షితుల వ్యాఖ్యలను వైసీపీ నేతలే ఖండించాలని పిలుపు
మరోసారి టీటీడీ ప్రధాన అర్చకుడిగా పదవీబాధ్యతలు అందుకున్న రమణ దీక్షితులు ఏపీ సీఎం జగన్ ను మహావిష్ణువుతో పోల్చడంపై తీవ్ర స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై స్వామి పరిపూర్ణానంద అసంతృప్తి వ్యక్తం చేశారు. విష్ణుమూర్తి అనుగ్రహంతోనే ఎవరికైనా రాజయోగం పడుతుందని, అలాంటిది రాజునే విష్ణువుతో పోల్చుతారా? అని వ్యాఖ్యానించారు.

జగన్ విష్ణువు అయితే వైసీపీ నేతలు వెంకటేశ్వరస్వామికి చేసినట్టే జగన్ కు కూడా పూజలు చేస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ను మహావిష్ణువుతో పోల్చుతూ రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలే ఖండించాలని స్పష్టం చేశారు. సీఎం జగన్ ను విష్ణువుతో పోల్చడం సరికాదని, అది జగన్ కే చేటు చేస్తుందని స్వామి పరిపూర్ణానంద అభిప్రాయపడ్డారు.

ఈ మధ్యాహ్నం తిరుపతిలో బీజేపీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న రత్నప్రభను గెలిపించాలని పిలుపునిచ్చారు.


More Telugu News