కరోనా వ్యాక్సిన్​ ఉత్పత్తికి అమెరికా, యూరప్​ ల ఆటంకాలు: సీరమ్​ సీఈవో

  • ముడి సరుకు ఎగుమతిపై ఆంక్షలు పెట్టాయన్న అదర్ పూనావాలా
  • అమెరికాలో ఆందోళన చేయాలనుందంటూ సరదా కామెంట్
  • ఆరు నెలలు–ఏడాది తర్వాత ఇస్తే ఉపయోగం లేదని వెల్లడి
  • నాణ్యత దృష్ట్యా చైనా నుంచి దిగుమతి చేసుకోలేమని వ్యాఖ్య
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి అమెరికా, యూరప్ లే ఆటంకాలు సృష్టిస్తున్నాయని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా అన్నారు. టీకాలకు అవసరమైన కీలక ముడి పదార్థాల ఎగుమతులపై ఆ దేశాలు ఆంక్షలు విధించాయన్నారు. ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఉత్పత్తికి ఎందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్న ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

‘‘కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమయ్యే ముడి పదార్థంపై ఎగుమతులు నిషేధించడం సరికాదంటూ అమెరికాలో ఆందోళనలు చేయాలని ఉంది. ముడిపదార్థం కొరతతో కొవిషీల్డ్, కొవాగ్జిన్ తో పాటు ఎన్నో వ్యాక్సిన్ల ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. మన ఒక్క దేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాలకూ ఇదే సమస్య ఎదురవుతోంది’’ అని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఆ ముడి పదార్థం లేక ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికిప్పుడు అది కావాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఆరు నెలలు లేదా ఏడాది తర్వాత దాని అవసరం అంతగా ఉండదన్నారు. అప్పటికే చాలా సంస్థలు కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేస్తాయని చెప్పారు. చైనా నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నా.. నాణ్యత, ఇతర ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని అక్కడి నుంచి తెప్పించుకోబోమన్నారు.

ప్రస్తుతం నెలకు 6 నుంచి ఆరున్నర కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నామని అదర్ చెప్పారు. జూన్ నాటికి 10 కోట్ల నుంచి 11 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. ముందుగా భారతీయులకే వ్యాక్సిన్లు అందించేలా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం పెట్టిన ధరలనే మరో మూడు నెలల పాటు కొనసాగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరిందన్నారు.


More Telugu News