హాలీవుడ్ నటుడు జాక్ అవెరీని ఆరెస్ట్ చేసిన ఎఫ్బీఐ!

  • సినిమాలు కొంటామని మోసపూరిత మాటలు
  • 690 మిలియన్ డాలర్లు సమీకరించిన జాక్ అవెరీ
  • నేరం రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష
వందల మందిని ఆకర్షణీయ స్కీముల పేరిట మోసం చేసి, మిలియన్ డాలర్లు దండుకున్న స్కామ్ లో యూఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు హాలీవుడ్ నటుడు జాక్ అవెరీని లాస్ ఏంజిల్స్ లో అరెస్ట్ చేశారు.

జాక్ అవెరీ అలియాస్ జాచరీ హార్విట్జ్ ఇన్వెస్టర్లను మోసం చేశాడని, తన '1 ఇన్ ఎంఎం' సంస్థ సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేసి, వాటిని నెట్ ఫ్లిక్స్, హెచ్బీఓ వంటి సంస్థలకు విక్రయిస్తుందని, తద్వారా 35 శాతానికి మించిన లాభాలను ఆర్జించవచ్చని నమ్మించి, వందలాది మంది నుంచి పెట్టుబడులు స్వీకరించారని అధికారులు తెలిపారు.

వాస్తవానికి ఆ సంస్థలతో జాక్ అవెరీకి ఎటువంటి వ్యాపార సంబంధాలూ లేవని, పెట్టుబడి రూపంలో వచ్చిన డబ్బులను సొంతానికి వాడుకున్నారని సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా, అటార్నీ ఆఫీస్ అధికారులు వెల్లడించారు. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 690 మిలియన్ డాలర్లను జాక్ అవెరీ సేకరించినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ పేర్కొంది. 2015లో ఈ స్కామ్ ప్రారంభమైందని, బాధితులకు చెల్లించాల్సిన డబ్బు విలువ 227 మిలియన్ డాలర్ల వరకూ ఉందని వెల్లడించింది.

ఈ స్కామ్ పై ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన 'లాస్ ఏంజిల్స్ టైమ్', జాక్ అవెరి ఓ చిన్న నటుడని, సినిమాల్లో విజయవంతం కాలేక ఈ స్కామ్ కు తెరలేపాడని, 2020లో వచ్చిన 'లాస్ట్ మూమెంట్ ఆఫ్ క్లారిటీ' చిత్రంలో నటించాడని వెల్లడించింది. తాను సేకరించిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని అతను గడిపాడని, లాస్ వెగాస్ వంటి నగరాలకు వెళ్లి, ఎంజాయ్ చేశాడని, 6 మిలియన్ డాలర్లతో ఓ ఇంటిని కొనుగోలు చేశాడని పేర్కొంది.

పెట్టుబడిదారులను తప్పుడు లైసెన్స్ అగ్రిమెంట్లు, నెట్ ఫ్లిక్స్, హెచ్బీఓ సంస్థలతో నకిలీ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్లు సృష్టించాడని కూడా యూఎస్ అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఈ కేసులో నేరం రుజువైతే అతనికి దాదాపు 20 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. 


More Telugu News