కఠినమైన సబ్జెక్టులకు భయపడొద్దు.. విద్యార్థులకు మోదీ సూచనలు

  • ‘పరీక్షా పే చర్చా’లో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని
  • కొవిడ్‌ నేపథ్యలో వర్చువల్‌ సమావేశం
  • పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రధాని సూచనలు
  • విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని తల్లిదండ్రులకు సూచన
మరికొన్ని రోజుల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం ద్వారా వారితో ముచ్చటించారు. విద్యార్థులు కఠినమైన సబ్జెక్టులకు భయపడొద్దని హితబోధ చేశారు. అందుకు తన జీవితంలోని ఓ దృష్టాంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తాను ఓ కఠిన సమస్యను పరిష్కరించడంతో ఆనాటి రోజును ప్రారంభిస్తానని తెలిపారు. దీంతో దినచర్యలో ఓ పెద్ద భారం తగ్గిపోతుందని.. ఇక ఇతర నిర్ణయాలు తీసుకోవడంలో తేలికవుతుందని వివరించారు. అలాగే విద్యార్థులు సైతం కఠిన సబ్జెక్టులకు భయపడొద్దంటూ వారిలో భరోసా నింపేందుకు ప్రధాని ప్రయత్నించారు.

ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో నిష్ణాతులు కాలేరని తెలిపారు. అందుకు లెజెండరీ సింగర్‌‌ లతా మంగేష్కర్‌ని ప్రస్తావిస్తూ, విద్యార్థుల్లో విశ్వాసం పాదుకొల్పారు. ‘‘లతా మంగేష్కర్‌కు భూగోళశాస్త్రం పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, పాడడంలో ఆమెకు ఆమే సాటి. మీకు కూడా కొన్ని సబ్జెక్టులు కష్టమనిపించవచ్చు. అది ఫెయిల్‌ అయినట్లు కాదు. దాని నుంచి దూరంగా వెళ్లొద్దు’’ అని ప్రధాని విద్యార్థులకు సూచించారు.  

ఏటా విద్యార్థులతో నేరుగా ముచ్చటించే ప్రధాని.. కరోనా నేపథ్యంలో ఈసారి పరీక్షా పే చర్చను వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అనేక సూచనలు చేశారు. పరీక్ష సమయంలో ఇంట్లో గంభీర వాతావరణానికి తావివ్వకూడదని ప్రధాని సూచించారు. లేదంటే పిల్లల్లో ఒకరకమైన ఒత్తిడి ప్రారంభమవుతుందని తెలిపారు. సాధారణ రోజుల్లాగే పరీక్షా సమయంలోనూ పిల్లలతో సరదాగా గడపాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలపై ఎలాంటి లక్ష్యాలు, ఆశయాలు రుద్దొద్దని తెలిపారు. దీని వల్ల వారు ఒత్తిడికి గురవుతారన్నారు.


More Telugu News