'రహానే.. ఎందుకంత సీరియస్‌గా ఉన్నావ్‌?' అంటూ ఆరా తీసిన అశ్విన్‌!

  • ఐపీఎల్‌ నేపథ్యంలో ఆటగాళ్లకు బయోబబుల్‌ తప్పనిసరి
  • వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్న వైనం
  • బబుల్‌ బయటి రోజుల్ని గుర్తుచేసుకున్న రహానే
  • సీరియస్‌గా ఉన్న చిత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
  • చిత్రంపై స్పందించిన అశ్విన్‌
సమయం దొరికినప్పుడల్లా బయట తిరుగుతూ సేదదీరే క్రికెటర్లు ఇప్పుడు బయో బబుల్ ఆంక్షల వల్ల కష్టకాలమే ఎదుర్కొంటున్నట్టున్నారు! అజింక్య రహానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ పిక్‌ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.

వివరాల్లోకి వెళితే.. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ 2021 ప్రారంభం కాబోతోంది. దీంతో క్రికెట్‌ బోర్డు నిబంధనల ప్రకారం.. లీగ్‌ ప్రారంభానికి ముందు ఆటగాళ్లందరూ బయో బబుల్‌లో ఉండాలి. అక్కడి నుంచే సాధన చేయాలి. బయటకు వెళ్లడంగానీ, ఇతరుల్ని కలవడానికిగానీ వీలు లేదు. సరదాగా బయటకు షికార్లకు వెళ్లే ఆటగాళ్లకు ఇది నిజంగా కఠిన పరీక్షే.

అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అజింక్య రహానే బయో బబుల్ బయట ఉన్నప్పటి రోజుల్ని తలచుకుంటూ కాస్త విచారం వ్యక్తం చేశాడు. ఓ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ‘ఇలా ఫొటోలకు పోజిచ్చే రోజుల్లో’ అంటూ కొంత నిరాశతో కూడిన వ్యాఖ్యలు చేశాడు.

దీన్ని గమనించిన ఢిల్లీ క్యాపిటల్స్‌లోని తన సహచరుడు రవిచంద్రన్ అశ్విన్‌ ‘‘ఏమైంది మిత్రమా?? ఆ మిలియన్‌ డాలర్ల చిరునవ్వు ఎక్కడ?’’ అని ప్రశ్నించాడు. దీనికి రహానే తనదైన శైలిలో స్పందించాడు. ‘నువ్వు వచ్చి బబుల్‌ చేరగానే వస్తుంది మిత్రమా’ అని సరదాగా సమాధానం ఇచ్చాడు. ఈ సంభాషణ సరదాగా సాగినా, బబుల్‌లో ఉన్న ఆటగాళ్లు బయటి జీవితాన్ని కోల్పోతున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.


More Telugu News