మాస్కు స‌రిగ్గా పెట్టుకోలేద‌ని ఆటోడ్రైవ‌ర్‌ను న‌డిరోడ్డుపై దారుణంగా కొట్టిన పోలీసులు.. వీడియో ఇదిగో

  • మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో ఘ‌ట‌న‌
  • ముక్కు వ‌ర‌కు మాస్కు పెట్టుకోలేద‌ని వాగ్వివాదం
  • పోలీస్ స్టేష‌న్‌కు రావాల‌ని పోలీసుల డిమాండ్
  • రాన‌ని చెప్పినందుకు చిత‌గ్గొట్టిన వైనం
క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తోన్న నేప‌థ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో మాస్కులు ధ‌రించ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేశారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించకూడ‌ద‌ని పోలీసులు సూచిస్తున్నారు. అయితే, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఇండోర్‌లో మాస్కు స‌రిగ్గా పెట్టుకోలేద‌ని ఓ వ్య‌క్తిని పోలీసులు న‌డిరోడ్డుపై కింద‌ప‌డేసి కొట్టడం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కొంద‌రు సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు.
 
ఇండోర్‌లో కృష్ణ కేయర్‌ అనే ఆటో డ్రైవర్ తండ్రి అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తండ్రిని చూసేందుకు కృష్ణ త‌న కుమారుడితో కలిసి ఆటోలో బయలుదేరాడు. అయితే, మార్గ‌మ‌ధ్యంలో అతని ఆటోను ఆపిన పోలీసులు మాస్కును స‌రిగ్గా పెట్టుకోవాల‌ని చెప్పారు.

ముక్కు కూడా క‌వ‌ర్ అయ్యేలా పెట్టుకోవాల‌ని, కేవలం నోటి వ‌ర‌కే పెట్టుకుంటే స‌రిపోద‌న్నారు. దీంతో పోలీసులు, కృష్ణ‌కు మ‌ధ్య‌ వాగ్వివాదం చోటు చేసుకుంది.   ఆటోడ్రైవర్‌ను స్టేషన్‌కు రావాలని పోలీసులు చెప్పారు. అయితే, తాను రాన‌ని చెప్ప‌డంతో కృష్ణ‌ను రోడ్డుపైనే పోలీసులు చిత‌గ్గొట్టారు.

అత‌డిని పోలీసులు దారుణంగా కొడుతుంటే అక్క‌డున్న వారిలో కొందరు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. త‌న తండ్రిని కొట్టొద్ద‌ని అత‌డి కుమారుడు వేడుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. సంఘటన వెలుగులోకి రావడంతో ఆటోడ్రైవ‌ర్‌ను దారుణంగా కొట్టిన‌ పోలీసులు కమల్‌ ప్రజాపత్‌, ధర్మేంద్ర జాట్‌పై అధికారులు చ‌ర్య‌లు తీసుకుని, స‌స్పెన్ష‌న్ వేటు వేశారు.


More Telugu News