ఆలోపు ఎంతమందిని కాపాడుకుంటామనేదే ముఖ్యం: క‌రోనాపై బైడెన్ ఆందోళ‌న‌

  • అమెరికా ఇప్ప‌టికీ చావు బతుకుల రేసులోనే ఉంది
  • జులై 4వ తేదీలోపు తీవ్ర‌త త‌గ్గే అవ‌కాశం
  • ప్రతిఒక్కరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలి
  • కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి
క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అమెరికాపై విప‌రీతంగా ఉన్న విష‌యం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వర్జీనియాలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. త‌మ దేశం ఇప్పటికీ చావు బతుకుల రేసులోనే ఉందని, ప్రజలు తప్పనిసరిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని చెప్పారు.

త‌మ ప్ర‌భుత్వం 75 రోజుల్లో 150 మిలియన్ల డోసుల వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసిందని తెలిపారు. మొద‌ట‌ 100 రోజుల్లో 100 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయ‌న‌.. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని 200 మిలియన్లకు పెంచారు.

 ఈ ఏడాది జులై 4వ తేదీలోపు క‌రోనా తీవ్ర‌త త‌గ్గి మంచి రోజులు వస్తాయని ఆయ‌న తెలిపారు. ఆలోపు ఎంతమందిని కాపాడుకుంటామనేదే ముఖ్య‌మ‌ని ఆయ‌న చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు వేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఈ నెల‌‌ 19 నుంచి అమెరికాలో వయోజనులందరికీ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు. ఇప్ప‌టికీ అమెరికాలో కొత్త కేసులు పెరుగుతున్నాయ‌ని, ఆసుప‌త్రుల్లో చేరే బాధితుల సంఖ్య అధిక‌మ‌వుతుంద‌ని చెప్పారు.


More Telugu News