విశాఖలో అత్యంత విలువైన 18 ప్రభుత్వ భూములు అమ్మకానికి.. ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం

  • బీచ్‌రోడ్డులోని 13.59 ఎకరాల ధర రూ. 1,452 కోట్లుగా నిర్ణయం
  • ఆస్తుల సమగ్ర వివరాలను ఇంటర్నెట్‌లో పెట్టిన ఎన్‌బీసీసీ
  • ‘మిషన్ బిల్డ్ ఏపీ’లో భాగంగా ఆస్తుల విక్రయం
విశాఖపట్టణంలోని అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు కేంద్రం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ భూములను విక్రయించేందుకు కేంద్రప్రభుత్వ ఆధ్వరంలోని నవరత్న సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ) ప్రకటన చేసింది. ఇందులో బీచ్ రోడ్డులో  ఏపీఐఐసీకి చెందిన 13.59 ఎకరాల భూమి సహా మొత్తం 18 ఆస్తులు ఉన్నాయి. అలాగే, బీచ్ రోడ్డు మార్గంలోని భూమి ధరను రూ. 1,452 కోట్లుగా ఎన్‌బీసీసీ నిర్ణయించింది.

స్థలాల వివరాలు, వాటి ఫొటోలు, లే అవుట్ కాపీలు, ప్లాట్ నంబర్లు, మ్యాప్‌లు, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అవి ఎంత దూరంలో ఉన్నాయి? వంటి పలు వివరాలను ఎన్‌బీసీసీ ఇంటర్నెట్‌లో పెట్టింది. ‘మిషన్ బిల్డ్ ఏపీ’లో భాగంగా కొన్ని స్థలాలను ఏపీ ప్రభుత్వం విక్రయించాలని నిర్ణయించిందని, ఆయా స్థలాలకు ప్రభుత్వం తరపున తాము ఈ-వేలం నిర్వహిస్తున్నామని పేర్కొంది. దరఖాస్తు ఫారాన్ని కూడా ఇంటర్నెట్‌లో పెట్టింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ప్రీబిడ్ ముందస్తు మొత్తం (ఈఎండీ) సమర్పించాలని సూచించింది.


More Telugu News