ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు చెబుతుంటే.... బరిలో దిగుతున్నామని జిల్లా టీడీపీ నాయకులు అంటున్నారు: మంత్రి అవంతి

  • రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు
  • బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటన
  • చంద్రబాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్న అవంతి
  • చంద్రబాబు కార్యకర్తలను కూడా మోసం చేశాడని ఆరోపణ
  • ప్రజలు వైసీపీతోనే ఉన్నారని ఉద్ఘాటన
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిషత్ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు చెబుతుంటే, తాము ఎన్నికల బరిలో దిగుతున్నామని జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు గిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు బహిష్కరించినా, పోటీ చేసినా, చేయకపోయినా ప్రజలు మాత్రం వైసీపీతోనే ఉన్నారని ఉద్ఘాటించారు.

చంద్రబాబుపై పార్టీలో విశ్వాసం లోపించిందని, నేతలు వరుసగా పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని అవంతి వెల్లడించారు. తనకు, తన కుమారుడికి పదవులు ఉంటే చాలని చంద్రబాబు భావిస్తున్నాడని, కానీ కార్యకర్తలకు పదవులు అక్కర్లేదా? అని అవంతి ప్రశ్నించారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు చిత్తశుద్ధి గలవాళ్లే ఉంటారని, అలాంటి కార్యకర్తలను కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అభివర్ణించారు.

సీఎం జగన్ తో పోల్చితే చంద్రబాబు ప్రజాబలం లేని వ్యక్తి అని, ఆయన కుతంత్రాలతో రాజకీయాలకు పాల్పడే వ్యక్తి అని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికలోనూ, జడ్పీ ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అని, అందుకే చంద్రబాబు పారిపోయాడని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నాడని అన్నారు.


More Telugu News