జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశాను: రఘురామకృష్ణరాజు

  • సీబీఐ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
  • 11 చార్జిషీట్లలో జగన్ ఏ1 ముద్దాయి అంటూ రఘురామ వివరణ
  • కోర్టుకు హాజరుకాకపోవడం సబబు కాదని వ్యాఖ్యలు
  • ఒక్క ఆరోపణకే మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేశారు 
  • జగన్ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని హితవు
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో గత కొన్నేళ్లుగా సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. 11 సీబీఐ చార్జిషీట్లతో సీఎం జగన్ ఏ1 ముద్దాయిగా ఉన్నారని, అలాంటి వ్యక్తి అభివృద్ధి పనులంటూ కోర్టుకు హాజరుకాకపోవడం సబబేనా? అని ప్రశ్నించారు. అందుకే జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశానని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. న్యాయవ్యవస్థ నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలని అన్నారు.

సహ నిందితులుగా ఉన్న కొందరికి రాజకీయ పదవులు ఇచ్చారని, మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చారని వివరించారు. ఇవన్నీ తోటి నిందితులను ప్రభావితం చేయడం కాదా? అని నిలదీశారు. ఇంత జరుగుతుంటే సీబీఐ ఏంచేస్తోంది? అని ప్రశ్నించారు. కేవలం ఆరోపణ వచ్చినందుకే మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేశారని, ఇన్ని చార్జిషీట్లలో పేరున్న జగన్ ఆయనను ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదని అన్నారు. సీఎం పదవిని భారతికో, విజయమ్మకో ఎవరికిస్తారో మీ ఇష్టం అని వ్యాఖ్యానించారు.



More Telugu News