బంధువని చెప్పి ఈవీఎంలు, వీవీప్యాట్లతో తృణమూల్​ నేత ఇంట్లో పడుకున్న పోలింగ్​ అధికారి

  • బెంగాల్ లోని ఉలుబేరియా నియోజకవర్గంలో ఘటన
  • సెక్టార్ ఆఫీసర్ తపన్ సర్కార్ ను సస్పెండ్ చేసిన ఈసీ
  • అతడికి కేటాయించిన పోలీసులపైనా చర్యలకు ఆదేశం
బెంగాల్ లో మూడో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ.. తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో ఈవీఎంలు ఉండడం కలకలం రేపుతోంది. ఓ పోలింగ్ అధికారి నాలుగు ఈవీఎంలు, నాలుగు వీవీ ప్యాట్లతో.. తన బంధువని చెప్పి తృణమూల్ నేత ఇంట్లో పడుకున్నాడు. ఈ ఘటన ఉత్తర హౌరా జిల్లాలోని ఉలుబేరియా నియోజకవర్గంలో జరిగింది. ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించి, సదరు అధికారిని సస్పెండ్ చేసింది.

హౌరా సెక్టార్ 17 బాధ్యతలు నిర్వర్తిస్తున్న సెక్టార్ ఆఫీసర్ తపన్ సర్కార్.. ఓటింగ్ యంత్రాలతో స్థానిక తృణమూల్ నేత ఇంటికి వెళ్లాడని, అక్కడే సోమవారం రాత్రి పడుకున్నాడని ఈసీ తెలిపింది. స్థానిక నేతల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లారని ఈవీఎంలు, వీవీప్యాట్లను స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.

‘‘ఎన్నికల నియమావళికి ఇది విరుద్ధం. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించడమే. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అతడిని సస్పెండ్ చేశాం’’ అని ఈసీ తెలిపింది. తపన్ సర్కార్ కు అటాచ్ చేసిన పోలీసులనూ సస్పెండ్ చేసేలా అధికారులను ఆదేశించినట్టు పేర్కొంది. ఎన్నికల పరిశీలకుడి అధీనంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లున్నాయని, వాటి సీళ్లను పరిశీలించిన అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. ఎన్నికలకు ఆ ఈవీఎంలను వాడబోమని, కొత్తవి వాడుతామని ప్రకటించింది.

అయితే, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీస్ అప్పటికే పోలీసు సిబ్బందితో నిండిపోయిందని, చోటు లేక ఉలుబేరియాలోని తులసీబేరియాలో ఉన్న తన బంధువు, తృణమూల్ నేత గౌత్ ఘోష్ ఇంటికి వెళ్లానని సెక్టార్ ఆఫీసర్ తపన్ సర్కార్ చెబుతున్నాడు. కార్ లో ఈవీఎంలను పెట్టి తాను ఇంట్లో పడుకోవడం రిస్క్ అనిపించి.. వాటిని తన కూడా తీసుకువెళ్లానని చెప్పాడు. అయితే, అతడి వ్యాఖ్యలను బీజేపీ ఉలుబేరియా అభ్యర్థి చింతన్ బేరా తోసిపుచ్చారు. ఓట్లను కొల్లగొట్టేందుకే తృణమూల్ ఈ నాటకాలకు తెరదీసిందని ఆరోపించారు.


More Telugu News