అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తియ్యగా, కమ్మగా ఉన్నాయా?: పవన్ కల్యాణ్ పై సీపీఐ నారాయణ విసుర్లు

  • పశ్చిమ గోదావరి జిల్లాలో నారాయణ ఎన్నికల ప్రచారం 
  • పవన్ వేషాలు మార్చుతున్నాడని వ్యాఖ్యలు
  • ఇప్పటిదాకా చేగువేరా వేషం వేశాడని వెల్లడి
  • ఇప్పుడది సరిపోవడంలేదని వ్యంగ్యం
  • బీజేపీతో కలిశాక పాచిపోయిన లడ్డూలు తింటున్నాడని ఎద్దేవా
కేంద్రం ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందంటూ జనసేనాని పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా ప్రస్తావించారు. ఏపీలో పరిషత్ ఎన్నికల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేశారని, అక్కడ ఎన్నికలు పూర్తవగానే ఆ వేషం తీసేస్తారని వెల్లడించారు. ఇక్కడ పవన్ కల్యాణ్ కూడా మోదీ లాగానే వేషాలు మార్చుతాడని నారాయణ విమర్శించారు.

గతంలో చే గువేరా వేషం వేసిన పవన్ కల్యాణ్ కు ఇప్పుడా వేషం సరిపోవడంలేదని, బీజేపీతో కలిసి కొత్తవేషం వేసి, పాచిపోయిన లడ్డూలు తింటున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో ప్రత్యేకహోదా అంశంలో పాచిపోయిన లడ్డూలు అంటూ బీజేపీని విమర్శించిన పవన్ కల్యాణ్... ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆ పాచిపోయిన లడ్డూలే ఇప్పుడు రుచిగా ఉన్నాయా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

నారాయణ ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనా వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి ఎన్నికలను బహిష్కరించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. క్యాడర్ ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అన్నారు. ఒకరకంగా ఇది ఎన్నికల నుంచి పలాయనమేనని, బతికుండి కూడా ఓటేయకపోవడం అంటే చచ్చినట్టే లెక్క అని తనదైన శైలిలో భాష్యం చెప్పారు.


More Telugu News