నాపై విచారణ ఆదేశాలను రద్దు చేయండి: సుప్రీంను ఆశ్రయించనున్న అనిల్‌ దేశ్‌ముఖ్‌

  • అనిల్‌ దేశ్‌ముఖ్‌పై పరమ్‌వీర్‌ సింగ్‌ అవినీతి ఆరోపణలు
  • విచారణకు ఆదేశించిన హైకోర్టు
  • రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించే యోచనలో అనిల్‌
  • ఆయనకు మద్దతుగా ‘మహా’ప్రభుత్వం
  • నేడే హోంమంత్రి పదవికి రాజీనామా చేసిన అనిల్‌
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ నేతృత్వంలో ప్రాథమిక విచారణ జరపాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని రద్దు చేయాలని కోరుతూ మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఆయనకు మద్దతుగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం కోర్టుకు వెళ్లనుంది.  

అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఈరోజే హోంమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పదవిలో కొనసాగడం నైతికత కాదని.. అందుకే రాజీనామా చేస్తున్నానని సీఎం ఉద్ధవ్‌ థాకరేకు రాసిన లేఖలో అనిల్‌ పేర్కొన్నారు.  

ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ అనిల్‌ దేశ్‌ముఖ్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఓ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా.. ప్రాథమిక విచారణ జరపాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.

 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద కారులో పేలుడు పదార్థాలు పెట్టిన కేసులో పోలీసు అధికారి సచిన్‌ వాజే అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే, ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి  ప్రతినెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు పరమ్‌వీర్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ పరిణామాల చుట్టే ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి.


More Telugu News