1,30,000 ఉద్యోగాలు భర్తీ చేశాం.. మ‌రో 50 వేలు భ‌ర్తీ చేస్తాం: హ‌రీశ్ రావు

  • సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మోడల్ జిల్లా గ్రంథాలయం ప్రారంభం
  • పోటీ పరీక్షలకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వ్యాఖ్య‌
  • డిజిటల్ లైబ్రరీలో మొత్తం 13 కంప్యూటర్లు  
  • విద్యార్థులు వాడుకునేందుకు వీలుగా ఉచిత ఇంటర్నెట్  
తెలంగాణ‌లో ఉద్యోగ ఖాళీల భ‌ర్తీపై మంత్రి హ‌రీశ్ రావు మ‌రోసారి స్పందించారు. ఈ రోజు సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మోడల్ జిల్లా గ్రంథాలయ భవనాన్ని ఆయ‌న‌ ప్రారంభించి మాట్లాడుతూ..  ప్ర‌త్యేక రాష్ట్ర క‌ల సాకారం అయిన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు త‌మ ప్ర‌భుత్వం 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేసింద‌ని చెప్పారు. తాము మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని అన్నారు.

కాగా, తాను ప్రారంభించిన మోడల్ జిల్లా గ్రంథాలయం జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు స‌న్న‌ద్ధ‌మ‌య్యే విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు. డిజిటల్ లైబ్రరీలో మొత్తం 13 కంప్యూటర్లు కూడా ఉన్నాయని, వాటిని విద్యార్థులు వాడుకునేందుకు వీలుగా ఉచిత ఇంటర్నెట్ సౌక‌ర్యం కూడా క‌ల్పించామ‌ని చెప్పారు.

దీన్ని నేషనల్ డిజిటల్ లైబ్రరీకి లింక్ చేశామని చెప్పారు. అలాగే, ఈ మోడల్ జిల్లా గ్రంథాలయంలో అన్ని రకాల పుస్త‌కాల‌తో పాటు లైవ్ విజువల్స్, ఇంటర్ నేషనల్ జర్నల్స్ అందుబాటులో ఉంటాయని వివ‌రించారు. అంతేగాక‌, విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాలు ఏంటో చెబితే వాటిని కచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.


More Telugu News