క్రికెట్ లో సరికొత్త రికార్డును నెలకొల్పిన పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్!

  • ఛేజింగ్ లో 193 పరుగులు చేసిన జమాన్
  • 342 పరుగుల లక్షాన్ని నిర్దేశించిన దక్షిణాఫ్రికా 
  • లక్ష్య ఛేదనలో 17 పరుగుల దూరంలో ఆగిన పాక్
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్ సృష్టించాడు.ఛేజింగ్ చేసేటప్పుడు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డే ఆడుతున్న పాకిస్థాన్ జట్టులో ఫఖర్ జమాన్ ఛేజింగ్ లో ఏకంగా 193 పరుగులు చేసి, డబుల్ సెంచరీకి 7 పరుగుల దూరంలో ఆగిపోయాడు.

అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ పేరిట ఉండేది. వాట్సన్ ఓ మ్యాచ్ లో 185 పరుగులు చేయగా, ఆ రికార్డును జమాన్ తిరగరాశాడు. అయితే, ఇతని అద్భుత ఇన్నింగ్స్ కూడా పాకిస్థాన్ ను ఈ మ్యాచ్ లో కాపాడలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, 342 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, పాకిస్థాన్ జట్టు 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

ఛేజింగ్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోతున్నా, మరో ఎండ్ లో ఫఖర్ జమాన్ మాత్రం క్రీజులో కుదురుకుని, తన సత్తా చాటాడు. 10 సిక్సులు, 18 బౌండరీలతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 155 బంతుల్లోనే జమాన్ ఈ ఫీట్ సాధించాడు. జమాన్ మినహా మరే బ్యాట్స్ మెన్ రాణించకపోవడంతో పాకిస్థాన్ కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ చివరి ఓవర్ లో ఫఖర్ జమాన్ రన్నౌట్ కావడంతో పాకిస్థాన్ కు ఓటమి పాలైంది. 


More Telugu News