'ఆదిదాస్' మాజీ యజమాని ఇంట్లో దోపిడీ!

  • బెర్నార్డ్ తైపీ దంపతులపై దాడి
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
  • గతంలో ఫ్రాన్స్ మంత్రిగానూ పనిచేసిన బెర్నార్డ్
ఫ్రాన్స్ మాజీ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా పేరున్న షూ బ్రాండ్ ఆదిదాస్ మాజీ యజమాని బెర్నార్డ్ తైపీ ఇంట్లో నిన్న రాత్రి దోపిడీ జరిగింది. బెర్నార్డ్ దంపతులు నిద్రిస్తున్న వేళ, తలుపులు పగులగొట్టుకుని వచ్చిన నలుగురు దొంగలు, వారిద్దరినీ తీవ్రంగా కొట్టి, ఆపై కట్టేసి, ఇంటిని దోచుకెళ్లారు. ఈ ఘటన భారత కాలమానం ప్రకారం, ఆదివారం రాత్రి 12:30 గంటల సమయంలో జరిగిందని పోలీసులు వెల్లడించారు.

దోపిడీ తరువాత తనను తాను విడిపించుకోగలిగిన బెర్నార్డ్ భార్య డొమినిక్ తైపీ, పొరుగింటికి వెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపై పోలీసులు వచ్చి గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సను పొందేందుకు తైపీ నిరాకరించినట్టు తెలుస్తోంది.

ఇక వీరి ఇంటి నుంచి దొంగలు ఏమి దోచుకుని వెళ్లారన్న విషయమై ఇంకా పూర్తి వివరాలు అందలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఫ్రాన్స్ కు గతంలో మంత్రిగా పని చేసిన బెర్నార్డ్ తైపీ, క్రీడలు, మీడియా తదితర విభాగాల్లో దిగ్గజ సంస్థలను నడిపించాడు. ఆపై న్యాయపరమైన సమస్యల్లో ఇరుక్కుని, పాతాళానికి పడిపోయారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను కొనుగోలు చేసి, వాటిని లాభాల్లోకి నడిపించి, పెంచుకున్న సంపదతో 72 మీటర్ల పొడవైన లగ్జరీ పడవను, ఓ ఫుట్ బాల్ క్లబ్ ను కూడా ఆయన కొనుగోలు చేశారు.

అయితే, దశాబ్దం క్రితం ఆయనపై ఓ మోసం కేసు దాఖలైంది. 470 మిలియన్ డాలర్ల సెటిల్ మెంట్ కేసులో ఆయన చిక్కుకున్నాడు. ఆపై క్రమంగా ఆదిదాస్ కు దూరమవడంతో పాటు, తన పదవులను వదులుకోవాల్సి వచ్చింది. క్రమంగా ఆయన ఆస్తి కూడా కరిగిపోయింది.


More Telugu News