దర్యాప్తు సంస్థల్ని కేంద్రం అస్త్రంగా వాడుకుంటోంది: రాహుల్‌ గాంధీ

  • బీజేపీయేతర ప్రభుత్వాల్ని కూల్చేందుకు కేంద్రం యత్నం 
  • వామపక్ష కూటమిపై మోదీ మౌనం వహిస్తున్నారని వ్యాఖ్య
  • కేరళలో యూడీఎఫ్‌దే అధికారమని జోస్యం
  • 'న్యాయ్'‌ పథకం అమలు చేసి చూపుతామని హామీ
కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీయేతర పార్టీ ప్రభుత్వాలను కూల్చేందుకు అస్త్రంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన బీజేపీ, వామపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌.. వామపక్ష కూటమిపై ఎందుకు విరుచుకుపడడం లేదని రాహుల్‌ ప్రశ్నించారు. వామపక్షాలు సైతం బీజేపీ తరహాలోనే విభజన రాజకీయాలు చేస్తాయని.. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడతాయని ఆరోపించారు. అయితే, ప్రతిక్షణం కాంగ్రెస్‌ రహిత దేశాన్ని కోరుకునే మోదీ నోటి వెంట ఒక్కసారి కూడా వామపక్ష రహిత భారత్‌ అనే మాట రాలేదని పేర్కొన్నారు. ఇది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు.

కేరళలో కచ్చితంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(యూడీఎఫ్‌) అధికారంలోకి వస్తుందని రాహుల్‌ ధీమా వ్యక్తం చేశారు. పేదలకు ప్రతినెలా కనీస ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా రూపొందించిన ‘న్యాయ్‌’ పథకాన్ని అమలు చేసి తీరతామన్నారు. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఏప్రిల్‌ 6న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.


More Telugu News