ఇండోనేసియాలో భారీ వరదలు.. 44 మంది మృతి

  • కుండపోత వర్షాలతో విరిగిపడ్డ కొండచరియలు
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం
  • పూర్తిగా దెబ్బతిన్న ఫ్లోర్స్‌ ద్వీపం
  • ఇంకా బురదలోనే ఉన్న అనేక ప్రాంతాలు
ఇండోనేసియాలో కుండపోత వర్షాలు కురవడంతో భారీ ఎత్తున వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనలో కనీసం 44 మంది మృతిచెందారు. అనేక దీవుల సమాహారమైన ఆ దేశంలో ఏకంగా ఓ దీవి మొత్తం వరదల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో ఉన్న ఫ్లోర్స్‌ దీవి వరదల ధాటికి పూర్తిగా దెబ్బతిందని విపత్తు నివారణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికీ అనేక ప్రాంతాలు బురదమయంగానే ఉన్నాయని పేర్కొన్నారు. అనేక మంది ఆయా ప్రదేశాల్లో చిక్కుకొని ఉన్నట్లు తెలిపారు.

అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో కుండపోత వర్షాలు కురవడంతో కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇంకా అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో బురద కూరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ఉన్న ఏకైక దారి సముద్ర మార్గమే. అయితే, భారీ వర్షాలు, అలలు.. ప్రయాణానికి అడ్డంకిగా మారడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోవడంలో ఆలస్యమవుతోంది.


More Telugu News