సంజ‌య్ రౌత్ అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు: మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్‌కు చెప్పిన మిత్రప‌క్షం కాంగ్రెస్

  • కొన్ని రోజులుగా చోటు చేసుకుంటోన్న ప‌రిణామాల‌పై చ‌ర్చ
  • ‘కనీస ఉమ్మడి ప్రణాళిక’ను అనుస‌రించాల‌ని సూచ‌న‌
  • కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సంజ‌య్ విమర్శిస్తున్నారని ఫిర్యాదు
మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటోన్న ప‌రిణామాల‌పై చ‌ర్చించేందుకు సీఎం ఉద్ధవ్ థాకరేతో కాంగ్రెస్ నేతలు ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్బంగా వారు ఆయ‌న‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. ‘కనీస ఉమ్మడి ప్రణాళిక’ ను అనుస‌రించాల‌ని, దాని ప్రకారమే మ‌హారాష్ట్ర‌లో ప్రభుత్వం నడవాలని ఉద్ధ‌వ్ థాక‌రేను‌ కాంగ్రెస్ నేత‌లు కోరారు.

ఈ సంద‌ర్భంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై వారు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ప‌దే ప‌దే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని విమర్శిస్తున్నారని వారు చెప్పారు. అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని ఆయ‌నకు సూచించాల‌ని ఉద్ధ‌వ్‌ను కాంగ్రెస్ నేత‌లు కోరారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్మడిగానే తీసుకోవాలని వారు చెప్పారు.  

ఏకపక్ష నిర్ణ‌యాలు స‌రికాద‌ని తేల్చి చెప్పారు. ఈ సమావేశం ఉద్ధవ్ నివాసంలో దాదాపు గంట సేపు కొన‌సాగింది. మ‌హారాష్ట్రలో గిరిజనులు, దళితులకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వ్య‌యంపై త‌మ పార్టీ అధినేత్రి సోనియా రాసిన లేఖపై కూడా తాము చ‌ర్చించిన‌ట్లు కాంగ్రెస్ నేత‌లు తెలిపారు.


More Telugu News