50 కోట్ల ఫేస్ బుక్ ఖాతాదారుల ప్రైవేటు వివరాలు ఉచితంగా ఇస్తానంటున్న హ్యాకర్!

  • డేటా వివరాలు వాస్తవమేనంటున్న సైబర్ నిపుణులు
  • సమాచారం చాలా పాతదన్న ఫేస్ బుక్
  • లీకర్ ను సంప్రదిస్తే, ఇంకా రాని సమాధానం
ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేసిన ఓ వ్యక్తి, తన వద్ద 50 కోట్లకు పైగా ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఫోన్ నంబర్లతో సహా ఉన్నాయని, వాటిని దాదాపు ఉచితంగా అందిస్తానని ప్రకటించి కలకలంలేపాడు. హడ్సన్ రాక్ కేంద్రంగా నడుస్తున్న ఇజ్రాయెల్ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సహ వ్యవస్థాపకుడు అలెన్ గాల్ వెల్లడించిన వివరాల మేరకు, ఈ లీకర్ చూపిన డేటాబేస్, జనవరి నుంచి హ్యాకర్ సర్కిల్స్ లో ఫేస్ బుక్ కు లింక్ అయిన టెలిఫోన్ నంబర్లవేనని, ఈ వివరాలను తొలుత టెక్నాలజీ పబ్లికేషన్ సంస్థ మదర్ బోర్డ్ ప్రకటించిందని అన్నారు.

ఈ డేటా వాస్తవమైనదేనని, ఓ ప్రముఖ వెబ్ సైట్ ద్వారా, కింది స్థాయి హ్యాకర్లకు అతి తక్కువ ధరలో ఈ వివరాలన్నీ అందుతున్నాయని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో డేటా లీక్ పై స్పందించిన ఫేస్ బుక్, ఈ సమాచారం మొత్తం చాలా పాతదని పేర్కొంది. ఈ సమస్యను 2019 ఆగస్టులోనే పరిష్కరించామని వెల్లడించింది. ఇక పలు వార్తా సంస్థలు ఈ తాజా లీకర్ ను సంప్రదించాలని ప్రయత్నించి విఫలం అయ్యాయి.

సామాజిక మాధ్యమాలపై జరుగుతున్న దాడులు పెరిగిపోయాయని, యూజర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాన్ గాల్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పూర్తి వ్యక్తిగత వివరాలను ఉంచవద్దని ఆయన సలహా ఇచ్చారు. సమీప భవిష్యత్తులో మరింత మంది ఖాతాలకు సంబంధించిన వివరాలు హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు.


More Telugu News