ఆసుపత్రి మంటల్లో కాలిపోతున్నా.. రోగికి హార్ట్ సర్జరీ చేసిన రష్యా వైద్యులు

  • రష్యాలోని బ్లాగోవేషెన్క్స్ లో అగ్నిప్రమాదం
  • 1907లో నిర్మితమైన ఆసుపత్రి
  • ఆసుపత్రి నిర్మాణంలో కలప వినియోగం
  • త్వరగా వ్యాపించిన మంటలు
  • గ్రౌండ్ ఫ్లోర్ లో ఆపరేషన్ థియేటర్
వైద్యో నారాయణో హరి అని ఊరికే అనలేదు. రష్యాలో జరిగిన ఈ ఘటనను కూడా అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.  అగ్నికీలల్లో చిక్కుకుని ఆసుపత్రి తగలబడి పోతున్నా గానీ, రోగి ప్రాణాలే ముఖ్యమని భావించిన వైద్యులు గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసి దేవుళ్లు అనిపించుకున్నారు.

తూర్పు రష్యాలోని బ్లాగోవేషెన్క్స్ పట్టణంలో ఓ ఆసుపత్రి పైభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదే సమయంలో ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ రోగికి  వైద్యులు గుండె శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. అప్పటికింకా సర్జరీ పూర్తి కాలేదు... ఓవైపు అగ్నిప్రమాదంతో ఆసుపత్రిలో భీతావహ వాతావరణం నెలకొంది.

వెంటనే స్పందించిన ఆసుపత్రి వర్గాలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమించాయి. ఆసుపత్రిలో ఉన్న రోగులను, ఇతర సిబ్బందిని సురక్షితంగా బయటికి తరలించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆపరేషన్ థియేటర్ లోకి మంటలు, పొగ వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ ఎలక్ట్రిక్ కేబుల్ సాయంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూశారు.

దాంతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన వైద్యులు ఆ రోగికి విజయవంతంగా హార్ట్ సర్జరీ పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ లో 8 మంది డాక్టర్లు, నర్సులు పాలుపంచుకున్నారు. ఆ రోగిని కాపాడాలన్న బలమైన ఆకాంక్ష తమను అగ్నిప్రమాదంలోనూ ముందుకు నడిపించిందని ఆ ఆసుపత్రి చీఫ్ సర్జన్ వాలెంటిన్ ఫిలటావ్ వెల్లడించారు.

కాగా, ఈ ఆసుపత్రి 1907లో నిర్మితమైంది. ఆసుపత్రి పైభాగంలో కలపను అధికంగా ఉపయోగించారు. అందుకే త్వరగా మంటలు వ్యాపించినట్టు రష్యా ప్రభుత్వం తెలిపింది. తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి కూడా ఎంతో నిబ్బరంగా రోగికి శస్త్రచికిత్స చేసిన డాక్టర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది .


More Telugu News