తిరుపతి ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు.. వైసీపీపై విమ‌ర్శ‌లు

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీయే ప్ర‌త్యామ్నాయం
  • తిరుపతిలో అన్యమత ప్రచారాలు జ‌ర‌గ‌కుండా చ‌ట్టం తెస్తాం
  • విగ్రహాలు ధ్వంసం చేసే వారిని గుర్తించ‌లేక‌పోతున్నారు
  • వైసీపీ మతప్రచారం చేసుకుంటోంది
తిరుపతి లోక్‌సభ స్థానానికి ఎన్నికల‌ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో ప్ర‌ధాన పార్టీల నేత‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు కపిలతీర్థంలో బీజేపీ-జనసేన ప్రచార కార్య‌క్ర‌మాలు నిర్వహించాయి. ఇందులో బీజేపీ-జనసేన అభ్యర్థి రత్నప్రభ తర‌ఫున‌ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ప్ర‌చారంలో పాల్గొన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీయే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని చెప్పుకొచ్చారు. రాజకీయ పోరాటం నుంచి టీడీపీ పక్కకు తప్పుకుందని వ్యాఖ్యానించారు. ఒక‌వేళ తిరుప‌తి ఉప‌ ఎన్నికలో వైసీపీకి ఓట్లేసి గెలిపిస్తే పార్ల‌మెంటులో ఆ పార్టీ సంఖ్య పెరగ‌డం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఉండదని ఆయ‌న విమ‌ర్శించారు.

తాము తిరుపతిలో అన్యమత ప్రచారాలతో పాటు అన్యమత ప్రార్థనా మందిరాలు లేకుండా చట్టం తీసుకొస్తామని చెప్పారు. విగ్రహాలు ధ్వంసం చేసే వారిని గుర్తించ‌లేక‌పోవ‌డం ఏంట‌ని, టెక్నాల‌జీ ఇంత‌గా అభివృద్ధి చెందిన‌ప్ప‌టికీ నిందితుల‌ను గుర్తించ‌డంలో ఎందుకు విఫ‌ల‌మ‌వుతున్నార‌ని ప్ర‌శ్నించారు. వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న అంశాన్ని ప‌ట్టించుకోకుండా మతప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.


More Telugu News