నేను దేశ‌ ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌డితే ఈ ప‌నులు చేస్తా: రాహుల్ గాంధీ

  • దేశంలో ఉద్యోగ క‌ల్ప‌న‌పైనే అధికంగా దృష్టి పెడతా
  • అభివృద్ధి అంశం దేశానికి అవ‌స‌రమే
  • వృద్ధికి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు అది సంబంధం లేకుండా ఉంది
  • చైనాలో ఉద్యోగ క‌ల్ప‌న లాంటి స‌మ‌స్య‌లు లేవు
హార్వ‌ర్డ్ స్కూల్ ప్రొఫెస‌ర్‌ నికోల‌స్ బ‌ర్న్స్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడారు. తాను భార‌త ప్ర‌ధాని అయితే ఏం చేస్తాన‌న్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు. దేశంలో ఉద్యోగ క‌ల్ప‌న‌పైనే అధికంగా దృష్టి పెడతాన‌ని చెప్పారు.

అభివృద్ధి అంశం దేశానికి అవ‌స‌ర‌మైన‌ప్ప‌టికీ, వృద్ధికి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు అది సంబంధం లేకుండా ఉంద‌ని తెలిపారు. చైనాలో ఉద్యోగ క‌ల్ప‌న లాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని ఆయన చెప్పారు. ఆ దేశంలో ఉద్యోగాలు ఇవ్వ‌లేమ‌ని చైనా నేత ఎవ‌రూ చెప్ప‌లేర‌ని తెలిపారు.

వృద్ధి రేటు 9 శాతం ఉండ‌డం కంటే దానికి త‌గిన‌ట్లు ఉద్యోగాల క‌ల్ప‌న జ‌ర‌గ‌డం ముఖ్య‌మ‌ని చెప్పారు. అలా జ‌ర‌గ‌క‌పోతే ఆ వృద్ధి రేటు వృథాయేన‌ని తెలిపారు.  దేశ‌ వ్య‌వ‌స్థీకృత సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నాశ‌నం చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

కాగా, ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే దేశంలో మౌలిక వ్య‌వ‌స్థ‌లు ఉండాల‌ని, మీడియా స్వేచ్ఛ ఉండాలని తెలిపారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దేశంలోని ఇత‌ర పార్టీల‌యిన‌ బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీపీ కూడా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం లేదని ఆయ‌న గుర్తు చేశారు.

అందుకే ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే ప‌టిష్ఠ‌మైన‌ సంస్థాగ‌త నిర్మాణాలు అవ‌స‌ర‌మని చెప్పారు. బీజేపీ ప్ర‌ద‌ర్శిస్తోన్న వైఖ‌రి అంద‌రినీ అసంతృప్తికి గురి చేసేలా ఉంద‌ని తెలిపారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ క‌లిసి దేశ వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశాయ‌ని ఆరోపించారు.


More Telugu News