సన్యాసం స్వీకరించిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే.. శివరామానంద సరస్వతిగా పేరు మార్పు

  • 1978, 1989లలో బద్వేలు నుంచి ఎమ్మెల్యేగా విజయం
  • ఇకపై భగవంతుని సేవకే జీవితాన్ని అంకితం చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే
  • తన అభ్యుదయం కోసమేనన్న శివరామ కృష్ణారావు
కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వడ్డమాను శివరామకృష్ణారావు ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టారు. 1978, 1989లలో బద్వేలు నుంచి అసెంబ్లీకి ఎన్నికైన శివరామకృష్ణారావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ఇకపై భగవంతుడి సేవకే జీవితాన్ని అర్పించాలన్న ఉద్దేశంతో సన్యాస దీక్ష స్వీకరించారు. రాజమండ్రిలోని స్వామి సత్వవిదానంద సరస్వతి ఆధ్వర్యంలో గురువారం సన్యాసం స్వీకరించారు. తన పేరును శివరామానంద సరస్వతిగా మార్చుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను సన్యాసం తీసుకోవడం వెనక ఎలాంటి రాజకీయం లేదని, తన అభ్యుదయం కోసమే సన్యాస దీక్ష స్వీకరించినట్టు తెలిపారు. మానవుడు మాధవుడిగా ఎదగాలన్నదే తన కోరిక అని పేర్కొన్నారు. పోరుమామిళ్లలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కలమకూరులో శివాలయం, రామాలయాన్ని నిర్మించినట్టు చెప్పారు. కృష్ణుడి ఆలయం నిర్మాణ దశలో ఉందన్నారు.


More Telugu News