కోహ్లీ తమను ఎలా హెచ్చరించాడో వెల్లడించిన ఇంగ్లండ్ బ్యాట్స్ మన్

  • ఇటీవల భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్
  • 4 టెస్టుల సిరీస్ ను 3-1తో నెగ్గిన భారత్
  • తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం
  • ఆపై వరుసగా మూడు మ్యాచ్ లు నెగ్గిన భారత్ 
ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన 4 టెస్టుల సిరీస్ లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా 3-1తో విజేతగా నిలిచింది. స్పిన్నర్లు రాజ్యమేలిన ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ను ఇంగ్లండ్ నెగ్గగా, ఆపై భారత్ వరుసగా మూడు టెస్టుల్లో నెగ్గి సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని చాటింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాడు ఓలీ పోప్ ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా కోహ్లీ తన వద్దకు వచ్చి... ఈ సిరీస్ లో ఇదే చివరి ఫ్లాట్ పిచ్ అని హెచ్చరించాడని, ఇక మిగిలిన మ్యాచ్ ల్లో అన్నీ స్పిన్ పిచ్ లే అని పరోక్షంగా సూచించాడని పోప్ వివరించాడు.

"నాకు బాగా గుర్తు... నేను ఆ సమయంలో నాన్ స్ట్రయికర్స్ ఎండ్ లో ఉన్నాను. కోహ్లీ నేరుగా నా వద్దకు వచ్చాడు. ఈ సిరీస్ లో ఇక మీకు ఫ్లాట్ పిచ్ (బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్)లు కనిపించవు అని అన్నాడు. దాంతో అతడి మాటల్లోని భావం అర్థమైంది. ఇక మా బ్యాటింగ్ లైనప్ కు సవాలు తప్పదని అనుకున్నాను" అని పోప్ వివరించాడు.

చెన్నైలో తొలి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 578 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ (228) డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ 227 పరుగుల తేడాతో నెగ్గింది.


More Telugu News