ఆత్మహత్యకు యత్నించిన కేయూ విద్యార్థి సునీల్​ మృతి

  • ఈ రోజు ఉదయం కన్నుమూత
  • గాంధీకి మృతదేహం తరలింపు
  • భారీగా తరలివచ్చిన విద్యార్థులు, బంధువులు
  • పదవీ విరమణ వయసు పెంపుపై మనస్తాపం 
  • కొన్ని రోజులుగా నిమ్స్ లో చికిత్స
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ (25) మరణించాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ సింగ్ తండాకు చెందిన సునీల్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు ఇక రావని కలత చెంది గత నెల 26న హన్మకొండలో పురుగుల మందు తాగిన సంగతి తెలిసిందే.

తాను చచ్చిపోతున్నది చేతగాక కాదని, తన మరణంతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే చచ్చిపోతున్నానని పేర్కొంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.  సమాచారం అందుకున్న వెంటనే ఆ యువకుడిని వరంగల్ ఎంజీఎంకు తరలించిన పోలీసులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. అప్పటి నుంచి సునీల్ కు అక్కడే చికిత్స చేస్తున్నారు.

అయితే, శుక్రవారం ఉదయం అతడి పరిస్థితి విషమించి కన్నుమూశాడు. పోస్ట్​ మార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడి మరణవార్త తెలుసుకున్న విద్యార్థులు, బంధువులు భారీగా గాంధీ ఆసుపత్రికి తరలివచ్చారు. సునీల్​ కుటుంబానికి సీఎం కేసీఆర్​ వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు.

కాగా, ఐదేళ్లుగా సునీల్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నాడు. 2016లో పోలీస్ నియామకాల్లో అర్హత సాధించిన అతడు.. ఫిజికల్ టెస్టుల్లో విఫలమయ్యాడు. ప్రస్తుతం హన్మకొండలోని నయీంనగర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.


More Telugu News